17-12-2025 04:32:10 PM
ఏర్పాట్లు పూర్తి..
మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల నుండి భారీగా రానున్న భక్తులు..
తాండూరు (విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా యాలాల మండలం ముద్దాయిపేట్ లో వెలసిన శ్రీ జగన్మాత రేణుక ఎల్లమ్మ తల్లి తిరుణాల జాతర ఉత్సవాలు రేపటి నుండి (గురువారం) ప్రారంభం కానున్నాయి. అందుకుగాను గ్రామ పెద్దలు, యువకులు, నిర్వాహకులు అమ్మవారి దేవాలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో పాటు వివిధ రకాల పువ్వులతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఇక్కడి అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహిస్తే కోరిన కోరికలు తీరుతాయని... అనుకున్నది అనుకున్నట్టే జరుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
అమ్మవారిని దర్శించుకునేందుకు హైదరాబాద్, పాలమూరు ప్రాంతాలతో పాటు తెలంగాణ జిల్లాల నుండి మరియు మహారాష్ట్ర , కర్ణాటక రాష్ట్రాల నుండి భక్తులు భారీగా వస్తారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు భాను ప్రసాద్ గౌడ్ , ఉపాధ్యక్షుడు సుదర్శన్ గౌడ్, సర్పంచ్ రుద్రమణి రాజప్ప, ఉప సర్పంచ్ శివ కుమార్, గ్రామ పెద్దలు విటలయ్య, బిచ్చన్న గౌడ్, కృష్ణయ్య గౌడ్ మరియు గ్రామ యువకులు మాట్లాడుతూ..
18వ తేదీ గురువారం సాయంత్రం అమ్మవారికి ప్రత్యేక పూజలు,
19న సాయంత్రం నాలుగు గంటలకు సిడే, 20న చుక్క బోనం,
21న సాయంత్రం నాలుగు గంటలకు అమ్మవారి రథోత్సవం,
22న భక్తుల చేత భజన సంకీర్తన, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. ఉత్సవాలు జరిగే ఐదు రోజులపాటు తాండూర్ ఆర్టీసీ డిపో నుండి ప్రత్యేక బస్సుల సౌకర్యం ఉందన్నారు. ఇక అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు సైతం చేశామన్నారు.