12 August, 2026 | 1:32 AM

నిత్యం మురుగునీటితో సావాసం

12-08-2026 12:00 AM
  1. రోడ్డు పై పొంగి పొర్లుతున్న మురుగునీరు
  2. తాత్కాలిక చర్యలే తప్ప శాశ్వత పరిష్కారం లేదు

కూకట్ పల్లి, ఆగస్టు 11,(విజయక్రాంతి ): కాలనీ ఏర్పడిన తొలినాళ్లలో ఏర్పాటుచేసిన  డ్రైనేజీ వ్యవస్థను అభివృద్ధి చేయకపోవడం, దీనికి తోడు సమీప కాలనీలు అభివృద్ధి చెంది భారీగా నివాసాలు ఏర్పడడంతో ఎప్పుడో వేసిన డ్రైనేజీ పైప్ లైన్ లతో నిత్యం రోడ్డుపై మురుగునీరు పొంగిపొర్లుతుంది. ఆల్విన్ కాలనీ సర్కిల్ పరిధి ఆల్విన్ కాలనీ డివిజన్ తులసి నగర్ 3 లోని లోటస్ రెసిడెన్సి సమీపం నుండి స్రవంతి క్లాసిక్ అపార్ట్మెంట్ వరకు నిత్యం మురుగునీరు పొంగి ప్రవహిస్తుండటం తో స్థానికులు నిత్యం నరకం అనుభవిస్తున్నారు. అడుగు తీసి బయటకు పెట్టాలంటే దుర్గంధపూరిత మురుగు నీటిలో నడవలేక చిన్న పనులను సైతం వాయిదా వేస్తున్నట్లు వాపోతున్నారు.

నిత్యం ప్రవహిస్తున్న మురుగు నీటివల్ల దోమలు విపరీతంగా పెరిగి తీవ్ర అనారోగ్యాల పాలవుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఎన్నో సంవత్సరాల క్రితం అప్పటి జనాభాకు అనుగుణంగా డ్రైనేజీ పైప్ లైన్ చిన్నదిగా వేయడంతో ప్రస్తుత జనాభాకు డ్రైనేజీ పైప్ లైన్  అనుకూలంగా లేకపోవడంతో దిగువ ప్రాంతంలో ఉన్న మ్యాన్ హోల్ నిత్యం గంగా ప్రవాహంలా పొంగిపొర్లుతుందని, దుర్గంధపూరిత వాసనల మధ్యనే నిత్యం కాలం గడుపుతున్నామని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గతంలో ఎన్నోసార్లు ఇదే సమస్యపై అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ తాత్కాలికంగా డ్రైనేజ్ సమస్యను పరిష్కరించి వెళ్తున్నారే తప్ప శాశ్వత పరిష్కారం కల్పించడం లేదని ఆరోపిస్తున్నారు. గతంలో డ్రైనేజీ పైప్ లైన్ నిర్మించిన కాంట్రాక్టర్లు సరైన విధంగా నిర్మాణ పనులు చేపట్టకపోవడంతో డ్రైనేజీ వ్యవస్థ ఈ విధంగా మారిందని, మ్యాన్ హోల్ ల నిర్మాణము, పైపులైన్ల లెవెలింగ్ సరిగ్గా చేయకపోవడంతో ఇట్టి సమస్య ఏర్పడినట్టు కాలనీవాసులు పేర్కొంటున్నారు.

డ్రైనేజీ సమస్య పరిష్కరించాలని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ డ్రైనేజీ పైపుల నిర్మాణానికి నిధుల సమస్య ఉందని సమాధానము ఇవ్వడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అంటూ కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాయకులు, అధికారులు ఈ సమస్యపై దృష్టి పెట్టి వీలైనంత త్వరగా పరిష్కరించడానికి కృషి చేయాలని కాలనీవాసులు కోరుతున్నారు.

సమస్యను పరిష్కరించాలి

గత రెండు సంవత్సరాలుగా నిత్యం మురుగునీటితోటే సావాసం చేస్తున్నాం. ఎన్నోసార్లు అధికారుల దృష్టికి తీసుకువచ్చినప్పటికీ పట్టించుకోవడం లేదు. ఫిర్యాదు ఇచ్చిన ప్రతిసారి తాతకాలికంగా చర్యలు చేపడుతున్నారే కానీ శాశ్వత పరిష్కారం చూపడం లేదు. వర్షం వచ్చిందంటే మా బాధలు వర్ణతీ తం. నిత్యం మురికినీరు ప్రవహించే రో డ్డుపైనే బయటికి వెళ్లాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పం దించి కాలనీవాసుల సమస్యను పరిష్కరించాలె. 

 మురళి, స్థానికుడు