12 August, 2026 | 2:45 AM

జై హనుమాన్‌కు సై

12-08-2026 01:30 AM

భారతీయ చలనచిత్ర రంగంలో సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన ‘హను-మాన్’ చిత్రానికి సీక్వెల్‌గా, దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న పౌరాణిక ఫాంటసీ చిత్రం ‘జై హనుమాన్’. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు.

‘కాంతార’ చిత్రంతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న కన్నడ స్టార్ రిషబ్ శెట్టి ఈ సినిమాలో హనుమంతుడి పాత్రలో నటిస్తున్నారు. కథా పరంగా ఎంతో కీలకమైన అశ్వత్థామ పాత్రలో టాలీవుడ్ భల్లాలదేవుడు రానా దగ్గుబాటి నటిస్తుండగా, తొలిభాగంలో కథానాయకుడిగా మెప్పించిన తేజ సజ్జ కూడా ఈ సీక్వెల్‌లో ఒక ముఖ్య పాత్రలో అలరించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించి కీలకమైన షెడ్యూల్ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతోంది.

ఇదిలావుండగా, ఈ చిత్రానికి సంబంధించి ఒక భారీ అప్డేట్ వెలుగులోకి వచ్చింది. పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునే హీరోయిన్ వామికా గబ్బి ఈ చిత్రంలో ఒక కీలకమైన, శక్తిమంతమైన పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఇటీవలే విడుదలైన కోలీవుడ్ హిట్ చిత్రం ‘డీసీ’లో తన నటనతో మెప్పించిన వామికా, ఇప్పుడు ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో భాగమవడం విశేషం. తెలుగులో ‘భలే మంచి రోజు’, ‘గూఢచారి-2’ చిత్రాల తర్వాత ఆమె నటిస్తున్న మూడో చిత్రం ఇదే కావడం గమనార్హం. ఈ చిత్రానికి సంగీతం: కీరవాణి; సినిమాటోగ్రఫీ: ఎస్ తిరునావుక్కరసు; ప్రొడక్షన్ డిజైన్: శ్రీనాగేంద్ర తంగాల.