మారనున్న మేడ్చల్ ముఖచిత్రం?
పునర్విభజనతో పెరగనున్న నియోజకవర్గాలు
మరో 8 పెరిగే అవకాశం
అదనంగా మరో పార్లమెంట్ స్థానం
మేడ్చల్, మార్చి 26 (విజయక్రాంతి): నియోజకవర్గాల పునర్విభజనతో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో రాజకీయ ముఖచిత్రం మారనుంది. ప్రస్తుతం ఐదు అసెంబ్లీ ఒక పార్లమెంటు నియోజకవర్గం ఉండగా, అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య 13 కు పెరిగే అవకాశం ఉంది. మరో పార్లమెంటు నియోజకవర్గం ఏర్పడనుంది. రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలు 50% పెరగనున్నాయి. 2011 జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేయనున్నారు.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జనాభా 2460095. జనాభాపరంగా హైదరాబాద్ జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉండగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా రెండో స్థానంలో ఉంది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో నగర శివారు ప్రాంతం ఎక్కువగా ఉంది. ఈ ప్రాంతంలో రోజురోజుకు వలసలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఐదు నియోజకవ ర్గాల లో ఒక్కో దానిలో 6 నుంచి 7 .50 లక్షల వరకు ఓటర్లు ఉన్నారు. రాష్ట్రంలో అత్యధిక ఓటర్లు ఉన్న నియోజకవర్గాల జాబితాలో కుతుబుల్లాపూర్, మేడ్చల్ రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. మల్కాజిగిరిలో సైతం గణనీయంగా ఓటర్లు ఉన్నారు. ని యోజకవర్గాల పునర్విభజనలో ప్రతి నియోజకవర్గం రెండు, మూడుగా విడిపోనున్నాయి.
జిల్లా, కార్పొరేషన్ల సరిహద్దుల ఆధారంగా
జిల్లా, మున్సిపల్ కార్పొరేషన్ సరిహద్దులు పరిగణలోకి తీసుకొని కొత్త నియోజకవర్గాలు ఏర్పడనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కొత్తగా సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ లను ఏర్పాటు చేసింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని కొంత భాగం సైబరాబాద్, మరికొంత మల్కాజిగిరి కార్పొరేషన్లలో చేర్చారు. కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ నియోజక వర్గాలు పూర్తిగా, మేడ్చల్ నియోజకవర్గం పాక్షికంగా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఉండగా, ఉప్పల్, మల్కాజ్గిరి నియోజకవర్గం పూర్తిగా, మేడ్చల్ నియోజకవర్గం పాక్షికంగా మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్నాయి. ఒక అసెంబ్లీ నియోజకవర్గం ఒక మున్సిపల్ కార్పొరేషన్ లో ఉండేలా విభజన చేయనున్నారు.
పునర్విభజన ఇలా
మేడ్చల్ నియోజకవర్గం మేడ్చల్ నుంచి బోడుప్పల వరకు ఉంది. ఈ నియోజకవర్గంలో అదనంగా మరో రెండు ఏర్పాటు అయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కీసర కొత్తగా అసెంబ్లీ సెగ్మెంట్ గా అవతరించనుంది. కీసరలో ఇప్పటికే ఆర్డిఓ కార్యాలయం ఉంది. దీనికి తోడు కీసరగుట్ట ఆధ్యాత్మిక కేంద్రంగా పేరొందింది. కీసర పరిధిలో షామీర్పేట్, కీసర, నాగారం, దమ్మాయిగూడతో పాటు అలియాబాద్, మూడు చింతలపల్లి మున్సిపాలిటీలు ఉండే అవకాశం ఉంది.
బోడుప్పల్, ఘట్కేసర్, పీర్జాదిగూడ తదితర ప్రాంతాలతో మరో అసెంబ్లీ నియోజకవర్గ ఏర్పాటయ్యే అవకాశం ఉంది. మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎల్లంపేట మున్సిపాలిటీ తో పాటు మేడ్చల్, కిష్టాపూర్ పూడూర్, గుండ్ల పోచంపల్లి, కుతుబుల్లాపూర్ నియోజకవర్గంలోని కొన్ని వార్డులు కలిపే అవకాశం ఉందని అంటున్నారు. కుతుబుల్లాపూర్ నియోజకవర్గంలో మరో నియోజకవర్గ ఏర్పాటు కానుంది. నిజాంపేట్, ప్రగతి నగర్, బాచుపల్లి ప్రాంతాలతో ఏర్పాటవుతుందని అభిప్రాయపడుతున్నారు.
కూకట్పల్లిలో 15 డివిజన్లో ఉన్నాయి. కొత్తగా బాలానగర్ బోయిన్పల్లి అస్మత్ పెట్ ప్రశాంత్ నగర్ బేగంపేట్ తదితర ప్రాంతాలతో మరొకటి ఏర్పాటవుతుందని అంటు న్నారు. మల్కాజ్గిరి నియోజకవర్గంలో అల్వా ల్, ఉప్పల్ నియోజకవర్గంలో కాప్రా లేదా కుసాయిగూడ కొత్తగా అసెంబ్లీ నియోజకవర్గాలుగా ఏర్పాటయ్యే అవకాశం ఉంది. ఇవే కాకుండా జనసాంద్రత ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో మరో రెండు ఏర్పడనున్నాయి. మొత్తంగా మేడ్చల్ జిల్లాలోని సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 6, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 7 నియోజకవర్గాలు ఏర్పాటు అవుతాయని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
పార్లమెంట్ నియోజకవర్గంలో సైతం
ప్రస్తుతం మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గం దేశంలో అతిపెద్ద నియోజకవర్గం గా ఉంది. పునర్విభజనలో మరో పార్లమెంటు నియోజకవర్గం ఏర్పాటయ్య అవకాశముంది. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానం ఉండగా, కొత్తగా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పార్లమెంటు నియోజకవర్గం ఏర్పాటయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ప్రతి పార్లమెంటు నియోజక వర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. ఈ లెక్కన జిల్లాలో రెండు పార్లమెంట్ స్థానాలు ఏర్పడతాయని అంటున్నారు.




