calender_icon.png 23 February, 2026 | 10:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇచ్చిన హామీ ప్రకారం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం

23-02-2026 12:35:32 AM

ఏఐసీసీ సభ్యుడు సర్వోత్తమ్ రెడ్డి                       

సూర్యాపేట, ఫిబ్రవరి 22 (విజయక్రాంతి) : ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారమే ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని చేపడుతుందని ఏఐసీసీ సభ్యుడు రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి అన్నారు. మండలంలోని కాసరబాద గ్రామంలో దుండిగల రాములు ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల మొహంలో చిరునవ్వు చూడటమే ప్రజా ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని పేర్కొన్నారు.

పేదలకు సొంత ఇల్లు అందించిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన ప్రభుత్వమని తెలిపారు. గత ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టిస్తామని చెప్పి పదేళ్లు కాలం గడిపిందని, కానీ ఒక్కరికైనా పక్కా ఇల్లు ఇవ్వలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసి పేదల ఆశలను నెరవేర్చిందని గుర్తుచేశారు.

ప్రతి ఏడాది ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇందిరమ్మ ఇండ్ల చొప్పున మంజూరు చేసి ప్రతి పేద కుటుంబానికి పక్కా ఇల్లు నిర్మించి అందిస్తామని హామీ ఇచ్చారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనపై ప్రజలు విశ్వాసం వ్యక్తం చేశారని, సర్పంచ్ మరియు మున్సిపల్ ఎన్నికల ఫలితాలే అందుకు నిదర్శనమని అన్నారు. రాబోయే ఎన్నికల్లో కూడా ఇదే తీర్పు పునరావృతం అవుతుందన్నారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కోతి గోపాల్ రెడ్డి, గ్రామ పెద్దలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.