మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి
వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య
హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): వరంగల్ నగరంలో నిర్మాణంలో ఉన్న మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి భవన నిర్మాణ పనులను వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారదతో కలిసి వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య శుక్రవారం పరిశీలించారు. అనంతరం ఆసుపత్రి అభివృద్ధి పనులపై ఎంజీఎం సూపరిడెంటెంట్, ఎల్ అండ్ టీ, ఆర్ అండ్ బీ, విద్యుత్ శాఖ, జిడబ్ల్యూఎంసి, ఫైర్ శాఖ అధికారులతో ఎంపీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆసుపత్రి నిర్మాణ పురోగతిని అధికారులు ఎంపీకి వివరించారు.
అనంతరం ఎంపీ మాట్లాడుతూ వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని, నిర్మిస్తున్నారని తెలిపారు. త్వరలో పనులు పూర్తి చేసి, ఆసుపత్రిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా వేగంగా పూర్తి చేయాలని, రోగులకు అవసరమైన అన్ని వసతులు కల్పిస్తూ, నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు. వరంగల్ జిల్లాతో పాటు ఉత్తర తెలంగాణ ప్రజల వైద్య అవసరాల కోసం నిర్మిస్తున్న, వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి త్వరలోనే ఓపీ, ఐపీ వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయని వెల్లడించారు.
ఆస్పత్రికి సరిపడ డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, పారామెడికల్ సిబ్బంది సేవలందించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ప్రధానంగా ఎమర్జెన్సీ సేవలు 16 అంతస్తులో ఏర్పాటు చేస్తున్న బెడ్లకు ఆక్సిజన్ లైన్లు, ఫైర్ సేఫ్టీ వ్యవస్థ, సెంట్రల్ ఏసి లైన్, విద్యుత్ సరఫరా నీటి పైపులైను కనెక్షన్లు, క్యాన్సర్ విభాగానికి రేడియేషన్ థెరపీ కోసం ప్రత్యేక బంకర్లు, ఔట్ పేషెంట్ డిపార్ట్మెంట్ సేవలు, ఆడిటోరియం, ఆపరేషన్ థియేటర్ల నిర్మాణ పనులను పరిశీలించారు.
మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పూర్తిస్థాయిలో ప్రారంభమైతే ప్రజలకు హైదరాబాద్ స్థాయి వైద్య సేవలు వరంగల్లోని అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బీఎస్సీ రాఘవరెడ్డి, ఈఈ రాజేందర్, ఎల్ అండ్ టీ ప్రాజెక్టు మేనేజర్ శ్రావణ్ కుమార్, ఎంజీఎం సూపర్డెంటెంట్ డాక్టర్ హరీష్ చంద్రరెడ్డి, ఆర్ఎంఓ అశ్విన్ కుమార్, జిల్లా ఫైర్ అధికారి శ్రీధర్ రెడ్డి, ఇంజన్ ఎన్పీడీసీఎల్ ఎస్సి గీతం రెడ్డి, ఈఈ ఎలక్ట్రికల్ నరసయ్య, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మున్సిపల్ కార్పొరేషన్ రవికుమార్, ఎమ్మార్వో శ్రీకాంత్, ఇతర అధికారులు పాల్గొన్నారు.




