వారసత్వాన్ని కొనసాగిస్తారా!

02-05-2024 01:38:23 AM

ఆరు చోట్ల బరిలో సీనియర్ నేతల వారసులు 

గెలుపునకు కుటుంబమంతా ప్రచార బాట

సీనియర్లను ఢీకొడుతున్న యువనేతలు

హైదరాబాద్, మే 1 (విజయక్రాంతి): రాష్ట్రంలో మూడు ప్రధాన పార్టీల మధ్య లోక్‌సభ ఎన్నికల పోరు నువ్వా నేనా అన్నట్లు సాగుతోంది. ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో బరిలో నిలిచిన అభ్యర్థులు ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. ప్రత్యర్థులపై విమ ర్శలు కురిపిస్తూ ఎన్నికల క్షేత్రంలో దూసుకపోతున్నారు. ఈ సమరంలో వారసత్వం నిలిపేందుకు పలువురు నేతల కుమారులు ఎన్నికల బరిలో సీనియర్లతో తలపడుతున్నారు. వారసులు గెలిచేందుకు తండ్రులు తమ రాజకీయ అనుభవం రంగరించి ప్రత్యర్థుల ఎత్తుగడలు చిత్తుచేసేలా రాజకీయ వ్యుహాలు రచిస్తూ ప్రచారం అదరగొడుతున్నారు.

ఎన్నికల్లో మాజీ మంత్రి జానారెడ్డి తనయుడు రఘవీర్‌రెడ్డి నల్లగొండ నుంచి,   పోతుగంటి రాములు కుమారుడు భరత్ ప్రసాద్ నాగర్‌కర్నూల్ నుంచి, కడియం శ్రీహరి కూతురు కావ్య వరంగల్ నుంచి, రామసహాయం సురేందర్‌రెడ్డి తనయుడు రఘరాంరెడ్డి ఖమ్మం పార్లమెంటు నుంచి, వెలిచాల జగపతిరావు కుమారుడు రాజేందర్‌రావు కరీంనగర్ నుంచి, గడ్డం వివేక్ తనయుడు వంశీ పెద్దపల్లి నుంచి నిలబడ్డారు. వీరంతా మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేస్తుండటంతో విజయం సాధించేందుకు కుటుంబ సభ్యులంతా కుస్తీ పడుతున్నారు. ఆర్థిక బలం, అంగబలం ఉండటంతో పెద్ద ఎత్తున ఖర్చు చేస్తూ ప్రత్యర్థులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. 

కాంగ్రెస్ సీనియర్ నేత, దివంగత వెంకటస్వామి మనవడు గడ్డం వంశీ పెద్దపల్లి నుంచి బరిలో నిలిచారు. విదేశాల్లో డిగ్రీ పూర్తి చేశారు. అనంతరం పెన్నార్ ఇండస్ట్రీస్‌లో ఏడాదిపాటు పనిచేసి, తరువాత విశాఖ ఇండస్ట్రీస్‌లో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా చేరి కంపెనీ వ్యాపారం నిరంతరం అభివృద్ది చేయడంపై దృష్టి సారించారు. గత 15 ఏళ్లుగా టర్నోవర్ పెంచి లాభాలు తీసుకరావడంలో కీలకపాత్ర పోషించారు. ఎలక్ట్రికల్ ఆటోమొబైల్ సంస్థను ఏర్పాటు చేసి 500 మంది యువకులకు ఉపాధి కల్పించారు. తరువాత సేవా కార్యక్రమాలు చేపట్టి వికలాంగులకు కృత్రిమ అవయవాలు అందించారు. కంటి ఆరోగ్య శిబిరాలు నిర్వహించి సామాన్యులకు వైద్య సేవలందిం చారు. ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాల్లో అదనపు గదుల నిర్మించడంతో పాటు అదనంగా ఉండే ఉపాధ్యాయులకు వేతనాలు చెల్లించి వారిని ప్రోత్సహించారు. మహిళలకు నైపుణ్యాభివృద్ధి, టైలరింగ్ వంటి ఉచిత శిక్షణ కార్యక్రమాలు చేపట్టారు. 

వెలిచాల రాజేందర్‌రావు

రాజకీయం అనుభవం ఉన్న నేత వెలిచాల రాజేందర్‌రావు కాంగ్రెస్ పార్టీ నుంచి కరీంనగర్ లోక్‌సభ నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన తాత కేశవరావు స్వాతంత్య్ర సమరయోధుడు, కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా వ్యవరించారు. తండ్రి జగపతిరావు కరీంనగర్ ఎమ్మెల్యేగా పనిచేశారు. తాత, తండ్రి నుంచి రాజకీయ వారసత్వం అందిపుచ్చుకున్న రాజేందర్‌రావు సింగిల్ విండో చైర్మన్‌గా, కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా పనిచేశారు. 2001లో నూతనంగా ఏర్పడి టీఆర్‌ఎస్‌లో చేరి ప్రారంభంలో నాలుగేళ్లపాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. 2004లో చొప్పదండి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రస్తుతం జరిగే ఎన్నికల్లో ఎంపీగా బరిలో ఉన్నారు.

కుందూరు రఘువీర్‌రెడ్డి

రాష్ట్ర రాజకీయాల్లో కుందూరు జానారెడ్డికి ప్రత్యేక స్థానం ఉంది. పలుమార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి పలువురు ముఖ్యమంత్రుల క్యాబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. ఆయన కుమారుడు రఘువీర్‌రెడ్డి నల్లగొండ పార్లమెంటు స్థానం నుంచి బరిలో నిలిచారు. తండ్రి రాజకీయ అనుభవంతో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సోదరుడు జైవీర్ రెడ్డి నాగార్జునసాగర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. అదే ఊపులో తన విజయం కూడా ఖాయమని భావిస్తూ రఘువీర్ ప్రచారంలో దూసుకపోతున్నారు. 

పోతుగంటి భరత్‌ప్రసాద్

ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో రాజకీయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న పోతుగంటి రాములు కుమారుడు భరత్ ప్రసాద్ నాగర్ కర్నూల్ నుంచి బీజేపీ తరుఫున పోటీ చేస్తున్నారు. తన తండ్రి గత ఎన్నికల్లో ఇక్కడే నుంచి పోటీ చేసి గెలిచారు. ఇక్కడి నుంచి తనయుడు పోటీ చేస్తుండటంతో రాములు గెలుపు కోసం శక్తియుక్తులను ధారపోస్తున్నారు. భరత్‌ప్రసాద్ ప్రస్తుతం కల్వకుర్తి జడ్పీటీసీగా ఉన్నారు. గతంలో బీఆర్‌ఎస్ నుంచి తండ్రి, కుమారుడు గెలిచారు. భరత్ ప్రసాద్ జేఎన్‌టీయూలో బీటెక్, ఎంబిఏ పూర్తి చేశారు. ఉస్మానియా నుంచి ఎల్‌ఎల్‌బీ పట్టా పొందారు.

వరంగల్ నుంచి కడియం కావ్య

సీనియర్ నాయకులు కడియం శ్రీహరి వారసురాలిగా వరంగల్ నుంచి కాంగ్రెస్ తరుఫున ఎన్నికల్లో నిలబడ్డారు. కడియం ఫౌండేషన్ ఏర్పాటు చేసి వివిధ కార్యక్రమాలు చేపట్టారు. కరోనా సమయంలో క్రౌడ్ ఫండ్ విధానంతో పలువురుకి సహయం అందించి ప్రజలు దృష్టిలో పడింది. దక్కన్ మెడికల్ కళాశాల్లో ఎంబీబీఎస్, ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఎండీ పూర్తి చేశారు.  వరంగల్ కాకతీయ వైద్య కళాశాలలో సీనియర్ రెసిడెంట్‌గా పనిచేశారు. డాక్టర్ విద్యను అభ్యసించిన ఆమె గత కొంత కాలంగా వివిధ ప్రాంతాల ప్రజలతో మంచి సంబంధాలు కొనసాగించారు.

రామసహాయం రఘురాంరెడ్డి

రామసహాయం సురేందర్‌రెడ్డి వారసుడుగా రఘురాంరెడ్డి కాంగ్రెస్ నుంచి ఖమ్మం పార్లమెంటుకు పోటీ చేస్తున్నారు. నిజాం కళాశాలలో బీకామ్ పూర్తి చేసి అనంతరం పీజీ డిప్లొమా విద్యనభ్యసించారు. ప్రస్తుతం వ్యాపారరీత్యా హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. ఆయనకు ఇద్దరు కుమారులు వారిలో పెద్దకుమారుడు వినాయక్‌రెడ్డి సినీ హీరో దగ్గుపాటి వెంకటేష్ పెద్దకుమార్తె ఆశ్రితను వివాహమాడారు. చిన్న కుమారుడు అర్జున్‌రెడ్డి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కుమార్తెను పెళ్లి చేసుకున్నారు. రఘురాంరెడ్డి ముత్తాతలు సేవాదృక్పథం ఉన్న వ్యక్తులు. అప్పట్లో పేదలకు ఎన్నో సహాయ కార్యక్రమాలు అందించారు. మరిపెడ బంగ్లాలో మార్కెట్ యార్డు, పోలీసుస్టేషన్, తహసీల్దార్, ఎంపీడీవో, ఆర్టీసీ బస్టాండ్, పీహెచ్‌సీల, ప్రభుత్వ పాఠశాల, కళాశాలలు, టీటీడీ కల్యాణ మండపాలకు దశాబ్దాల క్రితం ఉచితంగా స్థలాలు ఇచ్చారు. 2011 నుంచి 2013 వరకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్యాటరన్‌గా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌కు, బోర్డు ఆప్ గవర్నర్స్ వైస్ చైర్మన్‌గా ఉన్నారు.