calender_icon.png 7 September, 2025 | 1:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్‌కు సహకరించండి

05-09-2025 01:46:26 AM

కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌కు డిప్యూటీ సీఎం భట్టి, 

మంత్రి తుమ్మల విజ్ఞప్తి

హైదరాబాద్, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి): -తెలంగాణలోని యంగ్ ఇండియా ఇంటిగేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రోగ్రామ్, దాని అనుబంధ పెట్టుబడులకు ప్రత్యేక ఆర్థికసాయం చేయాలని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు.

ఎఫ్‌ఆర్‌బీఎం నిధుల్లోనూ మినహాయింపు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేయనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కిల్స్ ప్రోగ్రామ్ అమలు విషయాన్ని వివరించారు. పది అంశాలతో కూడిన వినతిపత్రంలో పలు అంశాలు పేర్కొన్నారు. తెలంగాణలో విద్యా ప్రమాణాలు పెంచేందుకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టామని.. కేంద్రం నుంచి మద్దతు ఇవ్వాలని కోరారు.

దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో తెలంగాణ ఒకటయినప్పటికీ విద్యా, పోషకాహార రంగాల్లో ఫలితాలు తక్కువగా ఉన్నాయని చెప్పారు. చాలా ఏళ్లుగా ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల కోసం పెద్ద సంఖ్యలో రెసిడెన్షియల్ పాఠశాలలను మంజూరు చేసినా చాలా వరకు అద్దె ప్రాంగణాల్లో లేదా చిన్న భవనాల్లో నడస్తున్నాయని వివరించారు.

యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ సమగ్ర విద్యా విధానం కోసం అంచనా వేసిన ఆర్థిక వ్యయం రూ.30,000 కోట్లని ఈ వనరులను సమీకరించడానికి రాష్ర్ట ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితుల నుంచి మినహాయించాలని కోరారు. గత ప్రభుత్వం అధిక వడ్డీతో తీసుకున్న రుణాల పరిమితిని సడలించాలని, లోన్ రిస్ట్రక్చరింగ్ చేయాలని, రాష్ర్టంలో ఆయిల్ పామ్‌పై విధించే సుంకం తగ్గించాలని కోరారు. సమావేశంలో రాష్ర్ట ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు, ప్రాయోజిత పథకాల సమన్వయ కార్యదర్శి గౌరవ్ ఉప్పల్ పాల్గొన్నారు.