07-09-2025 01:30:17 PM
సీఎం సర్ ప్రైజ్ విజిట్ చేయడం మంచిదే... సమస్య రాలేదు
శోభాయాత్ర ఆలస్యమైంది: సీపీ ఆనంద్
హైదరాబాద్: హుస్సేన్ సాగర్ వద్ద వినాయక నిమజ్జనం తుది దశకు చేరుకుంది. మరో గంటలో వినాయక నిమజ్జనం ముగియనుంది. జీహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటి వరకు 2.61 లక్షల గణేష్ ప్రతిమల నిమజ్జనం చేసినట్లు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్(Hyderabad CP CV Anand) తెలిపారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో మొత్తం 1.40 లక్షల విగ్రహాలు నిమజ్జనం అయ్యాయని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి సమన్వయంతో టైమ్ కంటే ముందే నిమజ్జనం జరిగిందన్నారు. సున్నిత ప్రాంతమైన సౌత్ జోన్ విగ్రహాలను ముందు తీయించామని సీపీ వెల్లడించారు. 40 అడుగుల కన్నా ఎత్త ఉన్న విగ్రహాలు ఇసారి పెరిగాయని సీపీ ఆనంద్ సూచించారు. విగ్రహాల ఎత్తు పెరగడం వల్ల శోభయాత్ర ఆలస్యమైందని ఆయన పేర్కొన్నారు. నిన్న రాత్రి శోభా యాత్రలో జరిగిన గొడవల్లో 5 కేసులు నమోదు చేశామని తెలిపారు. నిమజ్జనం ప్రశాంతంగా పూర్తి చేసినందుకు పోలీసులకు ఆయన అభినందనలు తెలిపారు. సీఎం సర్ ప్రైజ్ విజిట్ చేయడం మంచిదే.. ఎలాంటి సమస్య రాలేదని చెప్పారు. అన్ని శాఖల సమన్వయంతో నిమజ్జన కార్యక్రమం విజయవంతం చేశామని పేర్కొన్నారు.
మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన 1,070 మందిని పట్టుకున్నాం, పిక్ పాకెటింగ్ కేసు కూడా నమోదు చేశామని హైదరాబాద్ సీపీ ఆనంద్ స్పష్టం చేశారు. గతేడాదితో పోలిస్తే ఈసారి క్రైమ్ రేట్ తగ్గిందని సూచించారు. ఈ సారి గణేష్ నిమజ్జనంలో సాంకేతికతను వాడాం.. 9 డ్రోన్లు ఉపయోగించామని తెలిపారు. 35 హై రైజ్ బిల్డింగ్స్ పై కెమెరాలు పెట్టి మానిటరింగ్ చేశామని వెల్లడించారు. నిన్న ఉదయం 6.30కి గణేష్ నిమజ్జన శోభాయాత్ర ప్రారంభమైందన్న సీపీ ఇంకా 900 విగ్రహాల నిమజ్జనం అవ్వాల్సి ఉందని పేర్కొన్నారు. చిన్న విగ్రహాలుకలుపుకొని ఈ రోజు 25 వేల విగ్రహాలు నిమజ్జనం అవ్వాల్సిఉందన్నారు. 40 గంటలు పాటు నిమజ్జన శోభాయాత్ర జరిగిందని వెల్లడించారు. 12,034 విగ్రహాలు ఆన్ లైన్ లో నమోదు చేసుకున్నారు.. 6,300 విగ్రహాలు నిన్నటి వరకు నిమజ్జనం అయ్యాయని తెలిపారు. ఇవి కాకుండా 1.20 లక్షల విగ్రహాలు జేబీ పాండ్స్, ఇతర చెరువుల్లో నిమజ్జనం చేసినట్లు చెప్పారు.