calender_icon.png 5 September, 2025 | 4:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆగ్రహించిన అన్నదాత

05-09-2025 01:31:56 AM

-పలుచోట్ల రైతుల నిరసనలు 

-హుస్నాబాద్‌లో మంత్రి పొన్నం క్యాంపు ఆఫీసు ముట్టడి

 - హనుమకొండ రహదారిపై రెండుగంటలపాటు ధర్నా 

-వేధిస్తున్న యూరియా కొరత

హుస్నాబాద్, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి): రాష్ట్రంలో రైతులను యూరియా కొరత వేధిస్తున్నది. దీంతో ఆగ్రహంతో రైతులు గురువారం పలుచోట్ల నిరసనలు వ్యక్తం చేశారు. యూరియా కోసం ఎరువుల దుకాణాలు, సొసైటీల వద్ద పడిగాపులు పడుతున్న రైతులు, ఎక్కడా యూరియా లభించకపోవడంతో ఆందోళనకు దిగారు.

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని మంత్రి పొన్నం ప్రభాకర్ క్యాంపు ఆఫీసును ముట్టడించారు. అంతుకుముందు సిద్దిపేట హనుమకొండ రహదారిని రెండున్నర గంటల పాటు దిగ్బంధం చేశారు. సుమారు రెండున్నర గంటల పాటు నిరసన తెలపడంతో రోడ్డుకు ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ‘

కలెక్టర్ రావాలి, మంత్రి రావాలి‘ అని నినాదాలు చేశారు. అధికారులు ఎవరూ స్పందించకపోవడంతో ఆగ్రహంతో ఊగిపోయిన రైతులు మంత్రి క్యాంపు ఆఫీసు వైపు దూసుకువెళ్లారు. రైతులు రావడం చూసి సిబ్బంది గేట్లు మూసివేయడంతో, రైతులు గేటు ముందు బైఠాయించి ప్రభుత్వానికి, మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా ‘మంత్రి పొన్నం ప్రభాకర్ అది చేశా, ఇది చేశా అని గొప్పలు చెబుతాడు. ఆ గొప్పలు వద్దు, యూరియా బస్తా ఇప్పించు చాలు!‘ అంటూ నిలదీశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేసి రైతులను బలవంతంగా లాక్కెళ్లడానికి ప్రయత్నించగా, రైతులు, పోలీసుల మధ్య తోపు లాట జరిగింది. చివరకు, రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు జోక్యం చేసుకొని రైతులతో మాట్లాడి, శాంతింపజేశారు. 

కొత్తగూడాలో యూరియా బస్తాల చోరీ

మహబూబాబాద్(విజయక్రాంతి)/ధర్మపురి/కోనరావుపేట: మహబూబాబాద్ జి ల్లా కొత్తగూడా మండలం పొగళ్లపల్లి సొసైటీ ఎరువుల విక్రయ కేంద్రం నుంచి హమాలీలు సందట్లో సడేమియా అన్న చందంగా 90 బస్తాల యూరియాను 32 మంది తల రెండు మూడు చొప్పున తీసుకెళ్లారు. గురువారం ఉదయం యూరియా పంపిణీ చేయ డానికి వెళ్లిన వ్యవసాయ శాఖ అధికారి ఉద య్, ఎస్‌ఐ రాజకుమార్ యూరియా బస్తా లు తక్కువగా ఉండటం గమనించి విచారణ జరపగా తామే తీసుకెళ్లామని హమాలీలు అంగీకరించారు.

ఈ విషయంపై సొసైటీ సీ ఈఓకు ఈపాస్ యంత్రం ద్వారా యూరి యా పంపిణీ చేయకుండా, హమాలీలు తీసుకెళ్లడంపై నిర్లక్ష్యం చూపినందుకు షోకా జ్ నోటీస్ జారీ చేయనున్నట్లు ఏవో తెలిపారు. బయ్యారం మండలం కొత్తపేటలో ది వ్య ఎరువుల షాపు యజమాని తనకు కేటాయించిన 111 బస్తాల యూరియాను పిఓ ఎస్ యంత్రం ద్వారా కాకుండా, అధికారులకు సమాచారం ఇవ్వకుండా విక్రయించ డంతో లైసెన్స్ సస్పెండ్ చేస్తున్నట్లు ఏవో రాంజీ తెలిపారు.

మరిపెడ మండల కేంద్రంలోని సొసైటీ గోదాం నుండి 86 యూరి యా బస్తాలు ఎత్తుకెళ్లిన ఘటనలో ఐదుగురుపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సతీష్ తెలిపారు. చోరికి గురైన యూరియా బస్తాలను రికవరీ చేసినట్లు చెప్పారు. ఇదిలా ఉంటే జిల్లాలోని నరసింహులపేట, గూడూ రు మండల కేంద్రాల్లో యూరియా కోసం వందల సంఖ్యలో రైతులు గురువారం బా రులు తీరారు.

పెద్ద ఎత్తున మహిళలతో పా టు పురుషులు యూరియా బస్తాల కోసం క్యూ లో గంటల తరబడి నిరీక్షించారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం వ్యవసాయ మార్కెట్ వద్ద రైతులు రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని మరిమడ్ల గ్రామంలో యూరియ కోసం రోడ్డుపై రైతులు ధర్నా చేశారు. అనంతరం మండల వ్యవసాయ అధికారి సందీప్ కుమార్ మరిమడ్లకు చేరుకుని రైతులకు నచ్చజెప్పారు. 

ఏం చేసుకుంటారో చేసుకోండి..

-యూరియా లేదు.. బయటకుపోండి

-రైతుల పట్ల వ్యవసాయాధికారి దురుసు ప్రవర్తన

-ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో ఘటన

ఖమ్మం, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి): “యూరియా లేదు.. ఏం చేసుకుంటారో చేసుకోండి. ముందు సొసైటీ నుంచి బయటకుపోండి” అంటూ రైతులను నెట్టేస్తూ, ఓ వ్యవసాయాధికారి దురుసుగా ప్రవర్తించిన ఘటన ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో గురువారం జరిగింది. యూరియా కోసం నేలకొండపల్లి రైతులు సొసైటీకి వెళ్లారు. ఆ సమయంలో అక్కడ వున్న స్పెషల్ ఆఫీసర్ అయిన ఎంపీఈవో.. ఆగ్రహంతో వయసు పైబడిన రైతులనే 

కనికరం కూడా లేకుండా వారిపై చేతులు వేసి నెట్టేస్తూ బయటకు పోండి అని బెదిరించాడు. యూరియా లేదు ఏమి చేసుకోంటారో చేసుకోండి, కోర్ట్‌లో వేసుకొండని దురుసుగా ప్రవర్తించాడు. అక్కడే ఉన్న పోలీసులు కలుగజేసుకొని రైతులకు సర్ది చెప్పారు. అయితే సదరు అధికారి తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యూరియా దొరక్క ఇబ్బందులు పడుతున్న తమపై అధికారి 

దురుసుగా ప్రవర్తించడం తగదంటూ.. అతడిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ విషయంపై జిల్లా కలెక్టర్‌కు నివేదిక అందినట్లు సమాచారం.