డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో వాహనాల విడుదలపై వివాదం
హైకోర్టు ఆదేశాలు బేఖాతర్ చేస్తున్నారా?
కరీంనగర్ పోలీసుల తీరుపై విమర్శలు
కరీంనగర్ క్రైం, జూలై 9 (విజయక్రాంతి): డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడిన వ్యక్తుల వాహనాలను సంబంధిత యజమానులకు వెంటనే అప్పగించకుండా పోలీస్ స్టేషన్లకు తరలించి, అక్కడ మామూళ్ల పర్వం కొనసాగుతోందనే ఆరోపణలు కరీంనగర్లో వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులకు సంబంధించి తెలంగాణ హైకోర్టు ఇటీవల కీలక ఆదేశాలు జారీ చేసింది.
రవాణా శాఖ నిబంధనల్లోని 44ఏను తప్పనిసరిగా అమలు చేయాలని పోలీసులకు సూచించింది. మద్యం సేవించి వాహనం నడిపినట్లు నిర్ధారణ అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేయవచ్చని, అయితే కేవలం ఆ కారణంతో వాహనాన్ని సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదని హైకోర్టు స్పష్టం చేసింది.డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వచ్చిన పక్షంలో మూడు రోజులలోపు ఛార్జ్షీట్ దాఖలు చేయాలని కూడా కోర్టు పేర్కొంది.
2025లో సాయిరాం రావు అనే వ్యక్తి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడగా, పోలీసులు ఆయన వాహనాన్ని స్వా ధీనం చేసుకున్నారు. దీనిపై వాహన యజమాని విజయ్ హైకోర్టును ఆశ్రయించి పిటి షన్ దాఖలు చేశారు. కేసును విచారించిన న్యాయమూర్తి జస్టిస్ ఈ.వి. వేణుగోపాల్, మద్యం సేవించి వాహనం నడిపారన్న కారణంతో మాత్రమే వాహనాన్ని సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదని స్పష్టం చేశారు. వాహనానికి సంబంధించిన ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్ వంటి పత్రాలు సమర్పించినట్లయితే వాహనాన్ని యజమానికి తిరిగి అప్పగించాలని ఆదేశించారు.
అయితే కరీంనగర్లో మాత్రం వాహనాలను అధికారికంగా సీజ్ చేయకపోయినా, పోలీస్ స్టేషన్లకు తరలించి అక్కడే నిలిపివేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పట్టుబడిన ప్రదేశంలోనే వాహనాలను యజమానులకు అప్పగించకుండా స్టేషన్లకు రావాలని సూచించడం, కొన్నిచోట్ల అక్రమ వసూళ్లకు దారితీస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హైకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నప్పటికీ వాటి అమలుపై సందేహాలు వ్యక్తమవుతుండగా, ఉన్నతాధికారులు ఈ అంశంపై స్పం దించి స్పష్టత ఇవ్వాలని వాహనదారులు కోరుతున్నారు.






