22 August, 2026 | 1:46 AM

చారెడేసి కళ్లతో భావాలన్నీ పలికించి

22-08-2026 12:33 AM

చారెడేసి కళ్లతోనే భావాలన్నీ పలికించి, అభినయానికి అసలైన నిలువెత్తు రూపంగా నిలిచిన దక్షిణ భారత సినీ దిగ్గజం, ‘షావుకారు’ జానకి (94) ఇక లేరు. గత కొంతకాలంగా వయోభారంతో పాటు శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న ఆమె, చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం కన్నుమూశారు. ఏడు దశాబ్దాల సుదీర్ఘ సినీ ప్రస్థానంలో సుమారు 400ల చిత్రాల్లో నటించి తరాల సరిహద్దులను చెరిపేసిన జానకమ్మ నిర్యాణంతో సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగిపోయింది.

పెళ్లయిన తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. 

దక్షిణాది చిత్రసీమలో సహజ నటనకు, విలక్షణమైన పాత్రలకు మారుపేరుగా నిలిచిన అద్భుత నటి షావుకారు జానకి. ఆమె 70 ఏళ్లకు పైగా సాగిన తన సినీ ప్రస్థానంలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో నటించారు. కేవలం కథానాయికగానే కాకుండా.. హాస్యనటిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, అక్క, వదిన, తల్లి, నానమ్మ, బామ్మ పాత్రల్లో జీవించారు. ఆ రోజుల్లోనే పెళ్లయి, ఒక బిడ్డకు తల్లి అయిన తర్వాత కూడా స్వశక్తితో చిత్రసీమలోకి అడుగుపెట్టి విజయవంతమైన నటిగా నిలిచారు.

రేడియో నాటికల ద్వారా కెరీర్ ప్రారంభించి.. 

ఆకాశవాణి రేడియో నాటికల ద్వారా కెరీర్ ప్రారంభించిన ఆమె, రంగస్థల నాటకాలపై మక్కువతో అటువైపు అడుగులు వేశారు. 1950లో ప్రముఖ దర్శకుడు ఎల్‌వీ ప్రసాద్ దర్శకత్వంలో ఎన్టీఆర్ సరసన నటించిన ‘షావుకారు’ చిత్రంతో ఆమె వెండితెరకు పరిచయమయ్యారు. ఆ సినిమా సాధించిన ఘన విజయంతో జానకి కాస్తా ‘షావుకారు జానకి’గా మారిపోయారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, శివాజీ గణేశన్, ఎంజీఆర్, జెమినీ గణేశన్ వంటి మహామహుల సరసన ఆమె కథానాయికగా నటించి మెప్పించారు.

నలుగురు ముఖ్యమంత్రులుగా (ఎన్టీఆర్, ఎంజీఆర్, జయలలిత, కరుణానిధి) మారిన ప్రముఖులతో స్క్రీన్ షేర్ చేసుకున్న అరుదైన రికార్డు ఆమె సొంతం. కేవలం హీరోయిన్ పాత్రలకే పరిమితం కాకుండా అక్కగా, వదినగా, తల్లిగా, నానమ్మగా వైవిధ్యభరితమైన క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రల్లో రాణించారు. బహుభాషా ప్రావీణ్యం ఉండటంతో తన పాత్రలకు తానే డబ్బింగ్ చెప్పుకునేవారు. చిత్ర పరిశ్రమకు ఆమె చేసిన నిరంతర సేవలను గుర్తిస్తూ భారత ప్రభుత్వం 2022లో ఆమెను పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. 

ఇల్లు గడవక నటన వైపు.. 

వెండితెరపై ఎప్పుడూ నవ్వుతూ, హుందాగా కనిపించే షావుకారు జానకి నిజజీవితంలో అనుభవించిన కష్టాలు, అవమానాలు అన్నీ ఇన్నీ కావు. ఆమె పలు ఇంటర్వ్యూలలో తన వ్యక్తిగత బాధలను పంచుకున్నారు. కుటుంబ ఆర్థిక ఇబ్బందుల వల్ల, ఇల్లు గడవడమే కష్టంగా మారిన తరుణంలో ఆమె భర్త అనుమతితోనే సినిమాల్లోకి అడుగుపెట్టారు. ఆమె సినిమాల్లో నటించడం బంధువులకు అస్సలు నచ్చలేదు.

నటీమణిగా మారినందుకు బంధువులు ఆమెను తమ ఇళ్లలోకి కూడా రానివ్వకుండా ముఖం మీదే తిరస్కరించేవారు. సినీ రంగ ప్రవేశం చేసిన కొద్ది రోజులకే భర్తతో విభేదాలు రావడంతో వారిద్దరూ విడిపోయారు. పిల్లల పెళ్లిళ్లు అయ్యాక ఆమె పూర్తి ఒంటరి జీవితాన్ని గడిపారు. షూటింగ్ నుంచి ఇంటికి వస్తే తనతో మాట్లాడేవారే లేరని, జీవితాంతం ఒక ఒంటరితనం తనను వెంటాడిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

సినిమాల ద్వారా ఎంతో కష్టపడి సంపాదించిన కోట్ల రూపాయల ఆస్తులను భర్త వ్యసనాల కారణంగా కోల్పోవాల్సి వచ్చిందని ఆమె ఒక సందర్భంలో బయటపెట్టారు. తల్లిగా, తండ్రిగా అన్నీ తానై తన ముగ్గురు పిల్లలను (ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు) ఎంతో క్రమశిక్షణతో పెంచారు. తరువాతి కాలంలో ఐదు తరాల మనవళ్లు, మునవరాళ్లను చూసే అదృష్టం ఆమెకు దక్కింది. 

నలుగురు ముఖ్యమంత్రులతో నటన.. 

ఎన్‌టీ రామారావు, జయలలిత, ఎంజీ రామచంద్రన్, కరుణానిధి వంటి సినీ రంగానికి చెందిన నలుగురు ప్రముఖ ముఖ్యమంత్రులతో కలిసి నటించిన అరుదైన రికార్డు ఆమెకుంది.

తొలి పాన్-ఇండియా నటి.. 

1959లో డాక్టర్ రాజ్‌కుమార్ సరసన కన్నడలో వచ్చిన మొదటి పాన్-ఇండియా చిత్రం ‘మహిషాసుర మర్దిని’లో నటించి, తొలితరం పాన్-ఇండియా హీరోయిన్లలో ఒకరిగా నిలిచారు. ఆమె నటనకు గుర్తింపుగా భారత ప్రభుత్వం నుంచి ‘పద్మశ్రీ’ (2022), ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నంది అవార్డులు, ఫిల్మ్‌ఫేర్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డులను అందుకున్నారు.

ఐదు తరాల సాక్షి.. 

‘షావుకారు’ జానకి 1931 డిసెంబర్ 12న రాజమండ్రిలో ఒక కన్నడ మధ్వ బ్రాహ్మణ సంప్రదాయ కుటుంబంలో జన్మించారు. రాజమండ్రికి చెందిన టేకుమళ్ల వెంకోజీరావు, శచీదేవి దంపతుల కుమార్తె అయిన జానకి మరెవరో కాదు, ప్రముఖ నటి కృష్ణకుమారి సోదరి. జానకికి 15 ఏళ్ల చిన్న వయసులోనే శంకరమంచి శ్రీనివాసరావుతో వివాహం జరిగింది. వివాహానంతరం ఆమె పూర్తి పేరు శంకరమంచి జానకిగా మారింది. వివాహం తర్వాతే ఆమె చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు.

వ్యక్తిగత జీవితంలో ఆమె తన మునిమనవరాలి పిల్లల వరకు.. మొత్తం 5 తరాలు చూసిన అరుదైన అదృష్టం సొంతం చేసుకున్నారు. జీవితంలో ఎన్నో ఎదురుదెబ్బలు తగిలినా మొక్కవోని ధైర్యంతో, స్వాభిమానంతో జీవించిన ఆమె మరణం కేవలం టాలీవుడ్‌కే కాకుండా మొత్తం దక్షిణ భారత చిత్ర పరిశ్రమకు తీరని లోటు. ఆమె నటించిన అద్భుత పాత్రలు, ఆమె చూపిన సహజ నటన ఎప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో సజీవంగానే ఉంటాయి.  

సినిమా టైటిలే ఇంటి పేరుగా.. 

షావుకారు జానకి అసలు పేరు శంకరమంచి జానకి. అయితే 1950లో దర్శకుడు ఎల్.వి. ప్రసాద్ తెరకెక్కించిన ‘షావుకారు’ సినిమాతో ఆమె కథానాయికగా పరిచయమైంది. ఆ సమయంలో అప్పటికే తమిళంలో ప్రసిద్ధ నటి, ఎంజీ రామచంద్రన్ (ఎంజీఆర్) భార్య అయిన వీఎన్ జానకి, శంకరమంచి జానకి.. ఇద్దరి మధ్య కన్ఫ్యూజన్ లేకుండా ఉండటం కోసం, ఆమె మొదటి సినిమా పేరైన ‘షావుకారు’ను శంకరమంచి జానకి పేరు ముందుకు చేర్చి ‘షావుకారు జానకి’గా మార్చారు.  

కళ్లే ఆమె బలం.. 

తెలుగు చలనచిత్ర చరిత్రలో ఒక్కో నటికి ఒక్కో ప్రత్యేకమైన శారీరక లేదా అభినయ ముద్ర ఉంటుంది. ఉదాహరణకు సావిత్రికి అమాయకపు నవ్వు, జమునకు గడుసుతనం. అలాగే షావుకారు జానకి అనన్య సామాన్యమైన అభినయానికి ఆమె కళ్లే ప్రధాన బలం. ఆమె కళ్లు పెద్దవిగా, ఎంతో ప్రసన్నంగా ఉంటాయి. డైలాగ్ చెప్పకపోయినా కేవలం కళ్ల కదలికలతోనే బాధను, ఆనందాన్ని, ఆశ్చర్యా న్ని, అలకను పలికించగలగడం ఆమె ప్రత్యేకత.

ఆమె మొదటి సినిమా ‘షావుకా రు’ (1950)లో సత్యం (ఎన్టీఆర్) సరసన ‘సుబ్బులు’ అనే పాత్రలో ఆమె చూపించిన అమాయకత్వం, ఆ పాత్రలో ఆమె కళ్లలో కనిపించే జీవం ప్రేక్షకులను ఎంతగానో కట్టిపడేశాయి. ఆ సినిమాలో ఆమె కళ్లను చూసే ఎంతోమంది అభిమానులయ్యారు. ఆ తరం క్లాసిక్ సినిమాల్లో నటీమణుల కళ్లకు, చూపులకు దర్శకులు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చేవారు. జానకి క్లిష్టమైన భావోద్వేగాలను సైతం తన కళ్లలోనే పలికించి ‘సహజ నటి’గా గుర్తింపు తెచ్చుకున్నారు.

జానకి మరణంపై సీఎం రేవంత్ విచారం 

షావుకారు జానకి మరణంపై ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. చిన్నతనం నుంచే నాటకాల్లో వివిధ పాత్రలు పోషిస్తూ కెరీర్‌ను  ప్రారంభించిన షావుకారు జానకి పలు మేటి చిత్రాల్లో పోషించిన పాత్రలు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలుస్తాయని కొనియాడారు. చలనచిత్ర రంగంలో ఆమె లేని లోటు పూడ్చలేనిదని అన్నారు. భగవంతుడు ఆమెకు శాంతి చేకూర్చాలని ప్రార్థిస్తూ, అమె కుటుంబ సభ్యులకు, అభిమానులకు ముఖ్యమంత్రి సంతాపాన్ని, ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

‘పూర్ణోదయా’ దిగ్భ్రాంతి

“మన అందరి అభిమాన నటి మా ‘పూర్ణోదయా సంస్థ’ తొలి కథానాయకి, మా ‘తాయారమ్మ’  షావుకారు జానకి మృతి వార్త తీవ్ర దిగ్భ్రాంతికి, ఎంతో విషాదానికి గురిచేసింది. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాం” అని పూర్ణోదయా సంస్థ ప్రకటించింది. 

వార్త ఎంతో బాధ కలిగించింది: చిరంజీవి 

వైవిధ్యమైన పాత్రలకు తన సహజమైన నటనతో ప్రాణం పోసి, ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న గొప్ప నటి జానకి. భారతీయ చిత్ర పరిశ్రమకు ఆమె అందించిన సేవలు చిరస్మరణీయం. జానకి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా.  

ఆత్మకు శాంతి చేకూరాలి: పవన్ కళ్యాణ్ 

షావుకారు జానకి కన్నుమూశారని తెలిసి చింతించాను. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా. జానకి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా.

మా అనుబంధం ప్రత్యేకం: బాలకృష్ణ

మహానటి షావుకారు జానకి తుదిశ్వాస విడిచారన్న వార్త తెలియగానే దిగ్భ్రాంతికి గురయ్యా. జానకితో మా నందమూరి కుటుంబానికి ప్రత్యేక అనుబంధం ఉంది. నాన్న హీరోగా రిలీజైన తొలి చిత్రం ‘షావుకారు’తోనే ఆమె ‘షావుకారు జానకి’గా సుప్రసిద్ధులయ్యారు. అలా నాన్నకు జానకి తొలి హీరోయిన్, అలాగే ఆమె తొలి కథానాయకుడు ఆయన. నాన్నతో అనేక చిత్రాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు జానకి. మా ఎన్‌ఏటీ బ్యానర్‌లో రూపొందిన తొలిచిత్రం ‘పిచ్చిపుల్లయ్య’లో కీలక పాత్ర ధరించారు.

‘పాండురంగ మహాత్మ్యం’ నుంచీ ఎన్‌ఏటీ బ్యానర్ లోగోలో శ్రీవేంకటేశ్వర స్వామి విగ్రహానికి కుడివైపును జానకి కూర్చుని తెరపై కనిపించడం విశేషం. నేను ‘రామ్ ‘వేములవాడ భీమకవి’ చిత్రాల్లో షావుకారు జానకితో నటించే అదృష్టం నాకు దక్కింది. మన దేశంలో 75 ఏళ్ల సుదీర్ఘ నటనాప్రస్థానం చూసిన ఆర్టిస్ట్ షావుకారు జానకి ఒక్కరే అనుకుంటా. ఆ మహానటి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా. 

తమిళనాడు సీఎం విజయ్‌తోపాటు నటులు కమల్‌హాసన్, రాధిక, ఎన్టీఆర్ తదితర ప్రముఖులు షావుకారు జానకి మృతి పట్ల సామాజిక మాధ్య మాల ద్వారా సంతాపం ప్రకటించారు.