హెచ్1ఎన్1పై కేంద్రం అలర్ట్
ఒక్కరోజులోనే ఢిల్లీలో 114 సైన్‌ఫ్లూ కేసులు నమోదు
ఆరోగ్యశాఖాధికారులతో కేంద్రమంత్రి జేపీ నడ్డా సమీక్ష
రోగతీవ్రతను తగ్గించే అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశం
న్యూఢిల్లీ, ఆగస్టు 21: ఢిల్లీలో సైన్‌ఫ్లూ విజృంభిస్తోంది. ఒక్కరోజులో హెచ్1ఎన్1(సైన్‌ఫ్లూ) 114 కేసులు నమోదు అయ్యాయి. ఢిల్లీలో గతేడాదితో పోలిస్తే ఈ కేసులు దాదాపు ఆరు రెట్లు అధికంగా నమోదయ్యాయి. వర్షాకాలం కారణంగా ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కేరళం వంటి ప్రాంతాల్లో హెచ్1ఎన్1 కేసులు వేగంగా పెరుగుతున్నాయి.
దీంతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా అప్రమత్తమయ్యారు. దీంతో శుక్రవారం దేశవ్యాప్తంగా నెలకొన్న హెచ్1ఎన్1 పరిస్థితిని, సంసిద్ధతను సమీక్షించారు. ఆరోగ్యశాఖాధికారులతో ఉన్నత స్థాయి సమా వేశం నిర్వహించారు. 2026లో మొత్తం కేసుల సంఖ్య 1,777కు చేరుకుంది. నిఘా, వ్యాధి వ్యాప్తి, శ్వాసకోశ ఇన్ఫెక్షన్, పరీక్షలు, ప్రయోగశాలల్లో కేసుల పర్యవేక్షణపై అధికారులతో మంత్రి జేపీ నడ్డా మాట్లాడారు. సౌకర్యాలు, వైద్య సిబ్బందిని పెంచి రోగతీవ్రతను తగ్గించే చర్యలను చేపట్టాలన్నారు.
అదే సమయంలో ఇన్‌ఫ్లూయెంజాపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని చెప్పారు. క్రిటికల్ కేర్‌లో సౌకర్యాలు, సామగ్రి, మందుల లభ్యతను పెంచాలన్నారు. వ్యాధి తీవ్రత ఎక్కువవుతున్న నేపథ్యంలో ముంద స్తు చర్యలకు సిద్ధం కావాలని అధికారులను ఆదేశించారు. ఆగస్ట్ 20న 159 కేసులలో 114 కేసులు హెచ్1ఎన్1కు సంబంధించినవేనని, 72శాతం పెరిగాయని, ఇది ఆందోళన కరమేనని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో వ్యాధి తీవ్రతను తగ్గించేందుకు వైద్యులు నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని చెప్పారు. వ్యాధి సంక్రమణపై జాగ్రత్తలను ప్రజలకు వివరించేలా చర్యలు చేపట్టాలని, రద్దీ ప్రాం తాల్లో మాస్కులు వినియోగించేలా ప్రోత్సహించాలని సూచించారు.
అప్రమత్తంగా ఉండాలి
వ్యాధి సోకిన వ్యక్తి ద్వారా మరొకరికి సోకకుండా జాగ్రత్తలు చేపట్టాలని, సొంత వైద్యానికి వెళ్లకుండా వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందేలా చర్యలు చేపట్టాలని మంత్రి జేపీ నడ్డా అధికారులకు సూచించారు. అదే సమయంలో మలేరియా, డెంగ్యూ లాంటి వ్యాధులపై కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఢిల్లీ ప్రభుత్వం, పురపాలక శాఖా ధికారులు, ఆరోగ్య సంస్థలు, ఫ్రంట్ లైన్ అధికారులు అందరూ సమన్వయంతో ముందుకు వెళ్లాలన్నారు. ఈ సమావేశంలో ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ పంకజ్ కుమార్‌సింగ్, ఆరోగ్య, కుటుంబ, సంక్షేమ మంత్రిత్వ శాఖ, పలువురు సీనియర్ అధికారులు పాల్గొన్నారు.






