జీఎస్‌టీ వివాదాల త్వరిత పరిష్కారానికి సహకరించాలి
న్యాయమూర్తి సుశీల్ కుమార్ శర్మ
ముషీరాబాద్, జూలై 12 (విజయక్రాంతి): రెండు తెలుగు రాష్ట్రాల్లో జీఎస్టీ సంబంధిత వివాదాలను త్వరగా పరిష్కరించేందుకు ఛార్టర్డ్ అకౌంటెంట్లు, టాక్స్ న్యాయవాదులు సహకరించాలని జీఎస్టీ అప్పీలేట్ ట్రిబ్యునల్ హైదరాబాద్ బెంచ్ ఉపాధ్యక్షులు న్యాయమూర్తి సుశీల్ కుమార్ శర్మ కోరారు.
ఆదివారం బషీర్బాగ్లోని జీఎస్టీ భవన్లో ’తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ ట్యాక్స్ బార్ అసోసియేషన్’ అధ్యక్షుడు అవధేశ్ ప్రసాద్ దహిమ, కార్యదర్శి పీ.వి.నారాయణరావు, మాజీ అధ్యక్షులు సి.ఎ.వేముల చంద్రశేఖర్, సి.ఎ.హితేష్ జైన్ తదితరులు న్యాయమూర్తి సుశీల్ కుమార్ శర్మతో పాటు న్యాయ సభ్యుడు ఎ.పి.రవి, సాంకేతిక సభ్యుడు డా.డి.కె.శ్రీనివాస్ లను మర్యాదపూర్వకంగా కలిసి మెంబర్స్ డైరెక్టరీ-2026, వార్షిక నివేదికను అందజేశారు.
ఈ సందర్భంగా సుశీల్ కుమార్ శర్మ మాట్లాడుతూ జీఎస్టీ వ్యవస్థలో పన్ను న్యాయవాదులు, ఛార్టర్డ్ అకౌంటెంట్లు అధీకృత ప్రతినిధులుగా పారదర్శకంగా వ్యవహరిస్తూ మారుతున్న చట్టాలకు అనుగుణంగా ఆర్థిక, అకౌంటింగ్, చట్టపరమైన అంశాల్లో నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు.






