కాంగ్రెస్ శ్రేణులకు సహకార పదవులు
- పాలకవర్గాల భర్తీకి సర్కారు గ్రీన్ సిగ్నల్
- చైర్మన్‌తో పాటు డైరెక్టర్ పదవులకు నామినేటెడ్
- కాంగ్రెస్ నాయకుల్లో ఉత్సాహం
- మేడ్చల్ జిల్లాలో తొమ్మిది సహకార సంఘాలు
మేడ్చల్, ఏప్రిల్ 28(విజయ క్రాంతి): ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు నామినేటెడ్ పద్ధతిలో పాలక వర్గాలను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో అధికార కాంగ్రెస్ పార్టీ నేతల్లో ఆశలు రేకెత్తుతున్నాయి. పదవులు లేక నిరుత్సాహంతో ఉన్న కాంగ్రెస్ నాయకులకు సహకార పదవులు ఆశాదీపంలా కనిపిస్తున్నాయి. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని గ్రామాలు, మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో విలీనం చేశారు. దీంతో పదవులు తగ్గిపోయాయి. ఈ పరిస్థితుల్లో సహకార పదవులు భర్తీకి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో పలువురు నాయకులు సొసైటీ పదవులను ఆశిస్తున్నారు.
మిగతా జిల్లాలతో పోలిస్తే మేడ్చల్ జిల్లాలో సొసైటీల ద్వారా పెద్దగా క్రయవిక్రయాలు, రుణాల పంపిణీ ఉండదు. కానీ నాయకులకు హోదా లభిస్తుంది. జిల్లాలో కేవలం 9 సొసైటీలు మాత్రమే ఉన్నాయి. మేడ్చల్, డబిల్ పూర్, పూడూరు, బౌరంపేట్, అల్వాల్, షామీర్పేట్, ఘట్కేసర్, కీసర, దూలపల్లి సొసైటీలు మాత్రమే ఉన్నాయి. ఘట్కేసర్, పూడూరు ఎఫ్‌ఎ సి ఎస్ లు కాగా మిగతావి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు. సహకార చట్టం ప్రకారం ప్రతి సొసైటీ కి 13 మందితో పాలకవర్గం ఏర్పాటు చేస్తారు. చైర్మన్, వైస్ చైర్మన్ తో పాటు 11 మంది డైరెక్టర్లు ఉంటారు. ఎస్సీ మహిళ, ఎస్టీ జనరల్, బీసీ జనరల్ కేటగిరీలకు 3 డైరెక్టర్ పదవులు రిజర్వుడు చేస్తారు. మిగిలిన 10 డైరెక్టర్లు జనరల్ కేటగిరీలో భర్తీ చేస్తారు.
డిసిసిబి చైర్మన్ పదవి సైతం...
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు కలిపి జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఉంది. గతంలో ఎన్నికల ద్వారా డీసిసిబి చైర్మన్ పదవి భర్తీ అయ్యేది. సొసైటీ చైర్మన్లు డిసిసిబి డైరెక్టర్లను ఎన్నుకునే వారు. డిసిసిబి డైరెక్టర్లు చైర్మన్ ఎన్నుకునేవారు. డీసీఎంఎస్ కు కూడా ఇలాగే ఎన్నుకునేవారు. కానీ కొత్తగా ప్రభుత్వం నామినేటెడ్ చేయనుంది. సహకార సంఘాలకు పాలక వర్గాలు ఏర్పాటు చేశాకే డిసిసిబి తో పాటు రాష్ట్రస్థాయిలో ఉన్న మార్క్ఫెడ్, టెస్కాబ్ కు కూడా ఇదే తరహాలో పాలకవర్గాలు ఏర్పాటు చేయనుంది. డీసీఎంఎస్లను మార్క్ షెడ్ లో విలీనం చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. డీసీఎంఎస్లకు పాలకవర్గాలను నియమించకపోవచ్చని తెలుస్తోంది.
డిసిసిబి చైర్మన్ పదవికి డిమాండ్
డిసిసిబి చైర్మన్ పదవిని పలువురు ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా స్థాయి పదవి అయినందున పలువురు పోటీ పడుతున్నారు. అంతేగాక రాజకీయ ఎదుగుదలకు ఒక మెట్టు అవుతుందని భావిస్తున్నారు. గతంలో డిసిసిబి చైర్మన్గా పనిచేసిన మనోహర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. డిసిసిబి డైరెక్టర్, సొసైటీ చైర్మన్ పదవులను కూడా పలువురు నాయకులు ఆశిస్తున్నారు. అర్బన్ జిల్లాగా మారిన తర్వాత జెడ్పిటిసి, ఎంపీటీసీ, మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్ పదవులు లేవు. కార్పొరేటర్ పదవులకు మాత్రమే అవకాశం ఉంది. వాటికి కూడా నియోజకవర్గ స్థాయి నాయకుల కుటుంబ సభ్యులే పోటీకి సిద్ధమవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ద్వితీయ శ్రేణి నాయకులకు కార్పొరేటర్ పదవులు అవకాశాలు లేవు. దీంతో సొసైటీ పదవులతో సంతృప్తి చెందాలని భావిస్తున్నారు.
సహకార వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు
సహకార సంఘాల పాలకవర్గాలను నామినేటెడ్ ద్వారా భర్తీ చేసి సహకార వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు. చట్టం ప్రకారం సహకార సంఘాల పాలకవర్గాలను ఎట్టి పరిస్థితుల్లో నామినేటెడ్ ద్వారా భర్తీ చేసే అవకాశం లేదు. పాలకవర్గాలు అవినీతికి పాల్పడినప్పుడు మాత్రమే చేసి కొత్తగా పాలకవర్గాన్ని నామినేటెడ్ చేయవచ్చు. సహకార సంఘాలు రైతుల వాటా, డిపాజిట్ లతో నడుస్తున్నాయి. సిబ్బంది వేతనాలు కూడా సహకార సంఘాల ఇస్తున్నాయి.
ఇందులో ప్రభుత్వానికి సంబంధం ఏమీ లేదు. పాలకవర్గాల నియామకంపై కోర్టుకు వెళితే ఒక్క రోజులోనే కోర్టు కొట్టి వేస్తుంది. రైతులచే ఎన్నుకోబడిన పాలకవర్గాల గడువు ముగియగానే పర్సన్ ఇన్చార్జీలను నియమించి టెస్కాబ్ నుంచి డబ్బును ప్రభుత్వం దారి మళ్లించింది. ఆ డబ్బుకు వడ్డీ కూడా చెల్లించడం లేదు. ప్రభుత్వం నామినేటెడ్ పద్ధతి ఉపసంహరించుకొని వెంటనే ఎన్నికలు నిర్వహించాలి. -
ఆర్. మధుకర్ రెడ్డి, డీసీఎంఎస్ మాజీ వైస్ చైర్మన్






