29 April, 2026 | 3:22 AM

అక్రమ ఇసుక రవాణా చేస్తున్న రెండు ట్రాక్టర్లు సీజ్

29-04-2026 12:53 AM

నూతనకల్, ఏప్రిల్ 28: మండలంలో అక్రమ ఇసుక రవాణాపై పోలీసులు విరుచుకుపడ్డారు. ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా యథేచ్ఛగా ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను నూతనకల్ ఎస్.ఐ నాగరాజు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. వేర్వేరు వాగుల వద్ద నిర్వహించిన తనిఖీల్లో ఈ అక్రమ రవాణా బట్టబయలైంది.

పోలీసుల కథనం ప్రకారం.. పక్కా సమాచారంతో ఎస్.ఐ నాగరాజు తన సిబ్బందితో కలిసి మండలంలోని ప్రధాన వాగుల వద్ద నిఘా పెట్టారు.మొదటి వాహనాన్ని ఎడవల్లి గ్రామ శివారులో గల వాగు నుండి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ను పోలీసులు అడ్డుకున్నారు. ఆత్మకూర్ (ఎస్) మండలం పాతర్లపహాడ్ గ్రామానికి చెందిన నీలం అరుణ్ కుమార్ ఈ వాహనాన్ని నడుపుతున్నట్లు గుర్తించి, దానిని స్వాధీనం చేసుకున్నారు.

అనంతరం గుండ్ల సింగారం బ్రిడ్జి సమీపంలో గల వాగు వద్ద జరిపిన తనిఖీల్లో మరో ఇసుక ట్రాక్టర్ పట్టుబడింది. మండల కేంద్రానికి చెందిన వీరమల్ల భాను ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా ఇసుక తరలిస్తుండటంతో పోలీసులు ఆ వాహనాన్ని సీజ్ చేశారు. పట్టుబడిన రెండు ట్రాక్టర్లను పోలీస్ స్టేషన్కు తరలించి, అరుణ్ కుమార్ మరియు భానులపై కేసులు నమోదు చేసినట్లు ఎస్.ఐ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ప్రభుత్వ సంపదను కొల్లగొడితే సహించేది లేదు. వాగుల నుండి అనుమతి లేకుండా ఇసుక తీసినా, రవాణా చేసినా కఠిన చర్యలు తీసుకుంటాం. నిరంతర తనిఖీలు కొనసాగుతాయి‘ అని హెచ్చరించారు.