23-05-2025 12:00:00 AM
న్యూఢిల్లీ, మే 22: కేరళలో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. ఒక్క మే నెలలోనే రాష్ట్రంలో 182 పాజిటివ్ కేసులు నమోదైనట్టు కేరళ ఆరోగ్య శాఖ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించింది. కొత్తగా నమోదైన కేసుల్లో కొట్టాయంలో అధికంగా 57 కేసులు, ఎర్నాకులంలో 34, తిరువనంతపురంలో 30 కేసులు నమోదయ్యాయి. మిగిలిన జిల్లాల్లోనూ వైరస్ వ్యాప్తి క్రమంగా పెరుగుతుంది.
ఈ నేపథ్యంలో కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జి గురువారం వైద్యారోగ్యశాఖ అధికారులతో రాష్ట్ర ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. వీణా జార్జి మాట్లాడుతూ.. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో హైఅలర్ట్ ప్రక టించారు. హాంకాంగ్, సింగపూర్ దేశాల్లో కరోనా విజృంభిస్తోందని.. కేరళలో కూడా కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయని, అందరూ జాగ్రత్తగా ఉండాలన్నారు.
దగ్గు, జలుబు, గొంతు నొప్పి, ఇతర అనారోగ్య లక్షణాలు కనిపిస్తే వెంటనే మాస్క్ పెట్టుకోవాలని సూచించారు. కరోనాలోని ఒమిక్రాన్ జెఎన్1, ఎల్‌ఎఫ్7, ఎన్‌బీ1.8 రకం వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతుందని, దీనివల్ల పెద్దగా ముప్పు లేనప్పటికీ ప్రజలంతా జాగ్రత్తలు వహించాలని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో విధిగా ప్రొటోకాల్ పాటించాలని.. రద్దీ లేకుండా చూడాలని, ఎప్పటికప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కోవాలని డాక్టర్లు, నర్సులను ఆదేశించారు.