23-05-2025 12:00:00 AM
కిష్తార్, మే 22: పహల్గాం ఉగ్రదాడి తర్వాత భద్రతా బలగాలు జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవేటను ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో గురువారం కిష్తార్ జిల్లా కాల్పుల మోతతో దద్దరిల్లింది. భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన భీకర పోరులో ఇద్దరు ముష్కరులు హతమవ్వగా.. ఒక జవాన్ వీరమరణం చెందినట్టు తెలుస్తోంది. కిష్తార్ జిల్లాలోని చత్రోలోని సింగ్ పోరా ప్రాంతంలో ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి.
కిష్తార్ జిల్లాలో ఉగ్రవాదుల కదలికలకు సంబంధించి భద్రతా బలగాలకు సమాచారం అందింది. దీంతో ‘ఆపరేషన్ ట్రాషి’ అనే కోడ్‌నేమ్‌తో ఉమ్మడి ఆపరేషన్ చేపట్టాయి. భద్రతా బలగాలు అనుమానిత ప్రదేశానికి చేరుకోగానే అక్కడే నక్కిన ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు.
దీంతో భద్రతా బలగాలు ఎదురు కాల్పులు జరపడంతో ఇద్దరు ఉగ్రవాదులు మరణించినట్టు అధికారులు పేర్కొన్నారు. ఉగ్రవా దుల కాల్పుల్లో ఒక జవాన్ మరణించినట్టు ధ్రువీకరించారు. కాగా ఉగ్రవాదులను జల్లెడ పట్టి హతమార్చేవరకు‘ఆపరేషన్ ట్రాషి’ కొనసాగుతుందని అధికారులు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.