calender_icon.png 17 July, 2025 | 1:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాలుష్యం పేరుతో కార్పొరేట్ కుట్రలు

16-07-2025 01:12:52 AM

  1. ఆర్టీసీ ద్వారానే ఈవీ బస్సులు కొనాలి
  2. లేదంటే ప్రైవేటు ఎలక్ట్రిక్ బస్సులను అడ్డుకుంటాం
  3. ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్

హైదరాబాద్, జూలై 15 (విజయక్రాంతి): వాతావరణ కాలుష్యంతో పర్యావరణం దెబ్బతినకుండా ఉండాలంటే డీజిల్, పెట్రో ల్ బస్సులకు బదులుగా ఎలక్ట్రిక్ బస్సుల తయారీని కేంద్ర ప్రభుత్వం సమర్థించటాన్ని ఆర్టీసి ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్.బాబు, ఈదురు వెంకన్న ఒక ప్రకటనలో తప్పు పట్టారు.

కేవలం ఆర్టీసి బస్సుల వల్లనే పర్యావరణం దెబ్బతినడం లేదని, టూ వీలర్ దగ్గర నుంచి సుమారు 60 లక్షల వాహనాలు తెలంగాణలో తిరుగుతుంటే పర్యావరణం దెబ్బతిన డం లేదా అని వారు ప్రశ్నించారు. ఆర్టీసి బస్సుల వల్ల కాలుష్యం కేవలం 0.09 శాతం మాత్రమేనని, మిగిలిన కాలుష్యమంతా ఇతర వాహనాలతోనే వస్తోందని వారు అన్నారు. కాలుష్యం పేరుతో కార్పొరేట్ శక్తులకు సబ్సిడీ ఇచ్చి, ఎలక్ట్రిక్ బస్సులను తయారు చేయడం కార్పొరేట్ రంగాన్ని బలోపేతం చేసి, ఆర్టీసీలను నిర్వీర్యం చేయడమేనని పేర్కొన్నారు.

కార్పొరేట్ శక్తుల చేతుల్లో ఉన్న బస్ బాడీ బిల్డింగ్ యూనిట్లకు సబ్సిడీ ఇచ్చి వారిని బాగు చేసే బదులు అదే సబ్సిడీలు ఆర్టీసీలకిచ్చి వారి ఆధ్వర్యంలో బాడీ బిల్డింగ్ యూనిట్లలో ఎలక్ట్రిక్ బస్సుల తయారయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనివల్ల ఆర్టీసి బస్ బాడీ నిర్మాణాలకు ప్రోత్సాహం లభించడంతో పాటు నిరుద్యోగ సమస్య తీరుతుందన్నారు. 

ప్రైవేట్ సంస్థలకు డిపోలు

ఇప్పటికే 600 ఎలక్ట్రిక్ బస్సులు తెలంగాణ ఆర్టీసీలో అద్దె బస్సులుగా రావడం వలన కొన్ని డిపోలు, గ్యారేజీలు ప్రైవేట్ సంస్థలకు అప్పజెప్పారని వారు తెలిపారు. ఫలితంగా ఆ డిపోల నుంచి వందలాది మంది సిబ్బంది బలవంతంగా బయటికి గెంటివేయబడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. రాను రాను ఈ విద్యుత్ బస్సుల పేరుతో ఆర్టీసీని ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేయడానికి ప్రభుత్వం కంకణం కట్టుకున్నదని ఆరోపించారు.

ప్రభుత్వం మరో 2వేల ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నందున ఆ బస్సులను నేరుగా ఆర్టీసీ ద్వారా కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. లేదంటే ఈ ప్రైవేట్ విద్యుత్ బస్సులను అడ్డుకోవడానికి భవిష్యత్తులో  కార్మికోద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు.