calender_icon.png 16 July, 2025 | 8:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బనకచర్లపై భేటీ ఎందుకు?

16-07-2025 01:12:55 AM

సీఎంల భేటీలో ఆ విషయంపై చర్చించాల్సిన అవసరం లేదు

  1. తెలంగాణ ప్రతిపాదనలే అజెండాలో చేర్చాలని డిమాండ్ 
  2. అజెండా సవరించాలని కేంద్రానికి లేఖ రాసిన రాష్ట్ర ప్రభుత్వం

హైదరాబాద్, జూలై 15 (విజయక్రాంతి): రాష్ట్రాల మధ్య జలవివాదాలపై చర్చించేందుకు కేంద్ర జల శక్తి శాఖ ఈనెల 16న ఢిల్లీలో ఏర్పాటు చేసిన సమావేశంలో బనకచర్లను అజెండాగా చేర్చడంపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. బనకచర్లపై చర్చించాల్సిన అవసరం లేనేలేదని, వెంట నే అజెండాను సవరించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేంద్ర జలశక్తి కార్యదర్శికి మంగళవారం లేఖ రాశారు.

గోదావరి--బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై ఉన్న అభ్యంతరాలన్నింటినీ ప్రభుత్వం ఈ లేఖ లో ప్రస్తావించింది. బనకచర్లతో పాటు ఇతర అజెండా అంశాలు ఏమైనా ఉంటే వెంటనే పంపించాలని కేంద్ర జల్‌శక్తి శాఖ కోరగా.. కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్ అధ్యక్షతన బుధవారం మధ్యా హ్నం 2.30 గంటలకు ప్రతిపాదించిన సమావేశంలో బనకచర్లపై చర్చించాలని ఏపీ ప్రభుత్వం సింగిల్ అజెండాను కేంద్రానికి పంపించింది.

కేంద్ర జల్‌శక్తి అడిగిన అజెండా పాయింట్లపై స్పందించిన తెలంగాణ..సమావేశంలో బనకచర్లపై చర్చకు ఇందుకు నో చెప్తూ కేంద్రానికి ఈ లేఖ రాసింది. అయితే ఇప్పటికే కృష్ణాపై పెండింగులో ఉన్న ప్రాజెక్టులకు అనుమతులు, నీటి కేటాయింపులు, గతంలో కేంద్రం ఇచ్చిన హామీ ప్రకారం పాలమూరు, డిండి ప్రాజెక్టులను జాతీయ ప్రాజెక్టులుగా గుర్తించడం, తుమ్మడిహెట్టి వద్ద నిర్మించిన ప్రాణహిత ప్రాజెక్టుకు 80 టీఎంసీల నీటి కేటాయింపుతో పాటు ఏబీఐపీ సాయం, ఇచ్చంపల్లి వద్ద 200 టీఎంసీల వరద జలాల వినియోగానికి, కొత్త ప్రాజెక్టు నిర్మాణం తదితర అంశాలతో తెలంగాణ ప్రభుత్వం అజెండా ప్రతిపాదనలను పంపించింది. 

బనకచర్లను కేంద్ర సంస్థలన్నీ అభ్యంతరపెడుతున్నాయి..

జీఆర్‌ఎంబీ, సీడబ్ల్యూసీ, ఈఏసీ, పర్యావరణ మంత్రిత్వశాఖ బనకచర్లపై తీవ్ర అభ్యంతరాలు తెలిపాయి. ఇప్పటివరకు బనకచర్లకు ఎలాంటి అనుమతులు లేవని.. అందుకే చట్టాలను, ట్రిబ్యునల్ తీర్పులన్నీ ఉల్లంఘించే బనకచర్ల ప్రాజెక్టుపై చర్చించాల్సిన అవసరం లేదనే వాదనను తెలంగాణ ఈ లేఖలో ప్రస్తావించింది. రాష్ట్ర పునర్విభజన చట్టాన్ని సైతం ఈ ప్రాజెక్టు తుంగలో తొక్కుతోందని ఆరోపించింది.

గోదావరి-బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై చర్చించటం అనుచితమని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇలాంటి చర్యలు కేంద్ర ప్రభుత్వ నియంత్రణ సంస్థల విశ్వసనీయతను దెబ్బతీస్తాయని అందులో ప్రస్తావించింది. ఇప్పటికే ఏపీ సమర్పించిన ప్రీ-ఫీజిబిలిటీ రిపోర్ట్‌ను కేంద్ర పర్యావరణ శాఖ పరిధిలోని ఈఏసీ తిరస్కరించిన విషయాన్ని ఈ లేఖలో ఉటంకించింది.

కేంద్ర జల సంఘం కూడా ప్రీ ఫిజిబులిటీ రిపోర్టును తిరస్కరించాలని విజ్ఞప్తి చేశారు. డీపీఆర్ సమర్పించకుండా, టెండర్లు పిలవకుండా ఏపీని అడ్డుకోవాలని కోరారు. రెండు రాష్ట్రాల సీఎంల సమావేశంలో గోదావరి-బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై చర్చను వాయిదా వేయాలని, తెలంగాణ ప్రభుత్వం పంపించిన ప్రతిపాదనలను అజెండాలో చేర్చాలని విజ్ఞప్తి చేశారు.

ఏపీ పునర్విభజన చట్టం మేరకు కొత్త ప్రాజెక్టులు, జల వివాదాలకు సంబంధించిన అంశాలను కేంద్ర జల్‌శక్తి మంత్రి చైర్మన్‌గా, ఇరు రాష్ట్రాల సీఎంలు సభ్యులుగా అపెక్స్ కౌన్సిల్‌లో చర్చించాల్సి ఉండగా..ఏపీ బనకచర్లను ప్రతిపాదించగా..తెలంగాణ పూర్తిగా వ్యతిరేకిస్తూ కేంద్రానికి లేఖలు రాస్తూ వస్తోంది. కాగా..నేటి సమావేశంలో బనకచర్ల అంశం లేకుండా చూడాలని తెలంగాణ కోరిన నేపథ్యంలో ఏం జరగబోతోందనే అంశం ప్రాధాన్యం సంతరించుకుంది.