29 July, 2026 | 4:31 AM

అక్షరాలా లక్ష కోట్లు..

27-05-2024 12:10 AM

సార్వత్రిక ఎన్నికల నిర్వహణ ఖర్చు ఇదీ 

1951 నుంచి భారీగా పెరిగిన ఎన్నికల వ్యయం

2019లో రూ.50 వేల కోట్లకు పైమాటే..

ఒక్కో ఓటరుపై ఈసీ పెడుతున్న ఖర్చు రూ.46

అత్యంత పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ

న్యూఢిలీ, మే 26: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం మనది. ఇంత పెద్ద దేశంలో.. ఇంత మంది ఓటర్లు ఉన్న ఈ దేశంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడం కత్తిమీద సాము లాంటిదే. చాలా వ్యయ ప్రయాసలకోరిస్తే కానీ ఈ ప్రక్రియ సజావుగా జరగదు. ఏడు విడతల్లో 543 లోక్‌సభ స్థానాల్లో జరుగుతున్న ఈ ఎన్నికల సమరాన్ని ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఏప్రిల్ 19న మొదలైన ఎన్నికల ప్రక్రియ.. ఇప్పటికే ఆరు విడతల పోలింగ్ జరుపుకోగా, జూన్ 1వ తేదీన చిట్టచివరి విడత పోలింగ్ జరగనుంది. ఈ పోలింగ్‌లో ఎన్నికల రణానికి తెర పడుతుంది. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు జరిపి సాయంత్రానికి ఏ పార్టీ అధికారం చేపడుతుందో వెల్లడి కానుంది. మరి ఇంత అంగరంగ వైభవంగా జరుగుతున్న ఓట్ల పండుగ నిర్వహణకు ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకుందాం.. 

96.8 కోట్ల మంది ఓటర్లు..

దేశవ్యాప్తంగా 96.8 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. 1951 ఎన్నికల నుంచి ఇప్పటివరకు ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగుతూనే ఉంది. పటిష్టంగా ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం భారీ ప్రణాళికలు వేస్తూ ఉంటుంది. పోలింగ్ నుంచి అధికార మార్పిడి వరకు అంత సజావుగా సాగేందుకు తీవ్రంగా శ్రమిస్తుంది. సాంకేతికతను వినియోగించి ఓటర్లకు ఇబ్బందులు లేకుండా.. పారదర్శకతకు పెద్ద పీట వేస్తూ ఉంటుంది. అందుకే భారత్‌లో ఎన్నికల నిర్వహణ ప్రపంచంలోనే అత్యంత భారీ ప్రక్రియగా నిలిచింది. ఇన్ని కోట్ల మంది ఓటర్లు.. ఇన్ని విడతలు.. ఇంత మంది అభ్యర్థులు.. ఇన్ని లోక్‌సభ స్థానాలు ఉన్నప్పటికీ చాలా పకడ్బందీగా.. ఎంతో కట్టుదిట్టంగా ఎన్నికలను నిర్వహించగలదని కేంద్ర ఎన్నికల సంఘానికి మంచి పేరుంది. 

భారీగా పెరిగిన ఎన్నికల ఖర్చు

దేశంలో ఎన్నికల నిర్వహణ ఖర్చు ప్రతిసారి భారీగా పెరుగుతూ వస్తోంది. 1951 భారత్‌లో మొదటి లోక్‌సభకు ఎన్నికలు జరిగాయి. అప్పుడు ఏకంగా 68 విడతల్లో పోలింగ్ జరిగింది. అప్పుడు ఎన్నికల నిర్వహణ కోసం రూ.10.5 కోట్లు ఖర్చయింది. అది కాస్తా 2019 ఎన్నికల సమయానికి ఏకంగా రూ.50 వేల కోట్లకు పెరిగింది. ఇక ఇదే ట్రెండ్‌ను చూసుకుని అంచనా వేస్తే 2024 ఎన్నికలకు గత ఎన్నికలతో పోలిస్తే రెట్టింపు అవుతుందని తెలుస్తోంది. అంటే 2024 ఎన్నికల నిర్వహణకు ఏకంగా రూ.లక్ష కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. ఇంత భారీగా ఎన్నికల ఖర్చు పెరగడానికి ప్రధాన కారణం.. ఓటర్ల సంఖ్య పెరగడమే. ఆ తర్వాత ఎన్నికల ప్రచార శైలి మారడం, సోషల్ మీడియాలో ఎన్నికల ప్రచారం కారణంగా మరింత ఖర్చు పెరిగిపోయింది. 

ఒక్కో ఓటరుకు రూ.46 

1951 ఎన్నికల్లో ఒక్కో ఓటరుపై 6 పైసలు ఖర్చు కాగా.. 2014 నాటికి ఒక్కో ఓటరుపై పెట్టే ఖర్చు ఏకంగా రూ.46కు పెరిగింది. దీన్నిబట్టి ఎన్నికల నిర్వహణ ఏ మేరకు భారంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. ఆర్మీ అధికారులు, పోలింగ్ బూత్‌లలో సిబ్బంది కేటాయింపు.. వారికి చెల్లింపులు. ఈవీఎంల సేకరణ, వాటి నిర్వహణ, ఇంకు, అవగాహన సదస్సులు తదితరాలకు కేంద్ర ఎన్నికల సంఘానికి భారీగా ఖర్చు కానుంది. ఈవీఎంల కోసం పెట్టే ఖర్చు భారీగానే ఉంటోంది. 2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత ఈవీఎంలను సేకరించడం, వాటిని నిర్వహించడం కోసం పెడుతున్న ఖర్చు భారీగా పెరిగింది. 2019 ఎన్నికలు ముగిసిన తర్వాత ఈవీఎంల కోసం కేంద్రం రూ.25 కోట్లు కేటాయించగా, తాజా బడ్జెట్‌లో ఏకంగా రూ.1,891 కోట్లు విడుదల చేయడం గమనార్హం. ఈవీఎంల తర్వాత పోలింగ్ వెబ్ క్యాస్టింగ్, క్యాంపెయిన్, రాజకీయ పార్టీల ప్రచారం వల్ల ఖర్చు భారీగానే అవుతోంది. పైగా కేంద్ర ఎన్నికల సంఘంలో సిబ్బంది 2022లో 591 మంది ఉండగా, 2024 నాటికి 855 మంది అయ్యారు. 2018 రూ.236 కోట్ల బడ్జెట్ కాగా, 2023 నాటికి ఆ బడ్జెట్ రూ.340 కోట్లకు పెరిగింది.

భారీగా పెరిగిన అభ్యర్థులు

మొదటి లోక్‌సభ ఎన్నికల సమయంలో 1,874 మంది అభ్యర్థులు.. 53 పార్టీల నుంచి 401 లోక్‌సభ స్థానాల్లో పోటీలో ఉన్నారు. అప్పుడు 1.96 లక్షల పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేశారు. 2019 ఎన్నికల సమయానికి 673 పార్టీల నుంచి 543 లోక్‌సభ స్థానాలకు గాను 8,054 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. ఇక ఆ సమయంలో దాదాపు 10 లక్షల పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ దాదాపు 44 రోజుల పాటు సాగనుంది. మొదటి లోక్‌సభ ఎన్నికల తర్వాత ఇప్పటివరకు చూసుకుంటే ఈ ఎన్నికలే అత్యధిక కాలం జరిగిన ఎన్నికలు అని చెబుతున్నారు. మొదటి విడత ఎన్నికలు ఏకంగా 1951 అక్టోబర్ 25 నుంచి 1952 ఫిబ్రవరి 21 వరకు ఏకంగా నాలుగు నెలల పాటు జరిగాయి.