పోటీకి దూరంగా 78 మంది ఎంపీలు
ఎన్నికల వేళ బ్రిటన్ ప్రధాని రుషి సునాక్‌కు షాక్
ప్రచారం వదిలి సలహాదారులతో భేటీ
లండన్, మే 26: ముందస్తు ఎన్నికలకు వెళ్లిన బ్రిటన్ ప్రధాని రుషి సునాక్‌కు షాక్ మీద షాక్ తగులుతోంది. పార్టీలో సీనియర్ ఎంపీలు వరుసగా రాజీనామా చేస్తున్నారు. తాజాగా కేబినెట్ మంత్రులు మైఖేల్ గోవ్, ఆండ్రియా లీడ్సమ్ తమ సభ్యత్వానికి రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దని నిర్ణయించుకున్నారు. దీంతో పోటీ నుంచి తప్పుకున్న కన్జర్వేటివ్ పార్టీ సభ్యుల సంఖ్య 78కి చేరింది. ఈ పరిస్థితుల్లో ప్రచారం నుంచి విరామం తీసుకున్న సునాక్.. శనివారం తన సన్నిహిత సలహాదారులతో భేటీ అయ్యారు. ఎన్నికల వేళ మొదటి వారాంతంలో ప్రచారాన్ని వదిలి ఇలాంటి అసాధారణ నిర్ణయం ఇంతవరకు ఏ ప్రధాని తీసుకోలేదని పలు వార్తాసంస్థలు పేర్కొన్నాయి. ఈ విషయంపై ప్రతిపక్ష లేబర్ పార్టీ ఎంపీ స్టెల్లా క్రీసీ స్పందిస్తూ.. రుషి సునాక్‌కు రెస్ట్ అవసరమన్నారు. బ్రిటన్‌కు కూడా కొత్త ప్రభుత్వం అవసరం ఉందని ఎద్దేవా చేశారు.






