15 April, 2026 | 7:58 AM

పత్తి ఎకరాకు 12 క్వింటాళ్లు కొనాల్సిందే

04-11-2025 01:23 AM

జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టిన రైతులు 

అలంపూర్ నవంబర్ 03:ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు రైతులకు అవస్థలు తప్పడం లేదు. అధిక వర్షాల పరిస్థితుల కారణంగా పంట దిగుబడి అంతంత మాత్రమే వచ్చి నష్టాల్లో కూరుకుపోయామని చేతికి వచ్చిన పత్తి పంటను అమ్ముకునేందుకు సీసీఐ కేంద్రానికి పత్తిని తీసుకువస్తే...అక్కడ తేమ శాతం పేరుతో అధికారులు కొర్రీలు పెడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు... అంతేకాక సిసిఐ కొనుగోలు కేంద్రాల వద్ద నిబంధనల పేరుతో పత్తి రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు రైతులు వాపోయారు.

దీంతో ఆగ్రహించిన పత్తి రైతులు జాతీయ రహదారిపై ధర్నాకు చేపట్టారు.ఈ ఘటన గద్వాల జిల్లా ఉండవల్లి మండల పరిధిలోని వరసిద్ధి వినాయక కాటన్ మిల్లు ఎదుట హైదరాబాద్ కర్నూలు ప్రధాన జాతీయ రహదారిపై సోమవారం ఉదయం చోటుచేసుకుంది. పత్తి రైతు లా పాలిట కేంద్ర ప్రభుత్వం నిబంధనలు శాపంగా మారుతున్నాయని నిబంధనలను తొలగించి ఎకరాకు 12 క్వింటాల చొప్పున పత్తిని కొనాల్సిందేనట్టు రైతులు నినాదాలు చేశారు.

అధిక వర్షాలతో పంట దిగుబడి రాక నష్టపోయామని మళ్లీ నిబంధనల పేరుతో ఎకరాకు 7 క్వింటాల వరకు కొనడం ఏంటని నిబంధనల పేరుతో రైతులను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని రైతులు మండిపడ్డారు.ప్రభుత్వాలు పాలకులు రైతుల పట్ల ఆలోచించాలని ఆవేదన వ్యక్తం చేశారు.ధర్నా సమయంలో దాదాపు రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న సీఐ రవిబాబు ఘటన స్థలానికి చేరుకొని రైతులకు నచ్చజెప్పి ట్రాఫిక్ ఎలాంటి అంతరాయం లేకుండా చేశారు