వెంటాడుతున్న వరుణుడు కల్వకుర్తిలో భారీ వర్షం
కల్వకుర్తి అక్టోబర్ 03:ఎన్నడూ లేని విధంగా వర్షాకాలం ప్రారంభం నుండి నేటి వరకు వరుణ దేవుడు రైతులను వెంటాడుతూనే ఉన్నాడు. తుఫాన్ ప్రభావం ఇంకా తగ్గకముందే సోమవారం సాయంత్రం కల్వకుర్తిలో మళ్లీ భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా ఆకాశం మబ్బులతో కమ్ముకొని కుండపోత వర్షం కురవడంతో పట్టణంలోని ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. వర్షం సాయంత్రం సమయంలో కురవడంతో పాఠశాలల నుండి ఇంటికి చేరుకునే వి ద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
కోతలకొచ్చిన పత్తి, వరి రైతులకు భారీ నష్టం వాటిల్లింది. కోతలు పూర్తి చేసిన మొక్కజొన్నను ఆరబెట్టిన రైతులు ఇబ్బందుల్లో పడ్డారు. పట్టణ సమీపంలోని ఎల్లికల్ మార్గం వద్ద కాజ్వే పైనుంచి నీరు పెద్ద ఎత్తున పారడంతో రాకపోకలు నిలిచిపోయాయి. పట్టణ సమీపంలో తెలకపల్లి మార్గంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెరువు ఆటో కాలువను ఆక్రమించడంతో వర్షపు నీరు రోడ్డుపైకి చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇదే వర్షం కొనసాగితే రైతులు భారీ ఎత్తున నష్టపోయే అవకాశంలేకపోలేదు.




