30 March, 2026 | 5:31 AM

ఖాళీ అవుతున్న కారు

03-05-2024 02:07 AM

వనపర్తి నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ను వీడుతున్న కౌన్సిలర్లు, నాయకులు

గులాబీ పార్టీని అనుసరిస్తున్న కాంగ్రెస్ 

హస్తం, కమలం పార్టీల్లోకి వలసలు 

వనపర్తి, మే 2 (విజయక్రాంతి): రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి పదేళ్ల పాటు అధికారంలో ఉండి తమకిక తిరుగులేదనుకున్న బీఆర్‌ఎస్ పార్టీకి గడిచిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నుంచి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అధికారం కోల్పోయిన నాలుగు నెలలకే బీఆర్‌ఎస్ పార్టీకి వనపర్తి నియోజకవర్గంలో బీటలు పడుతున్నాయి. కీలక నేతలు మొదలుకొని కార్యకర్తల వరకు కాంగ్రెస్, బీజేపీ వైపు చూస్తున్నారు. మాజీ సీఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నియోజకవర్గంలో ఇప్పటికే ముఖ్యమైన నాయకులు, ప్రజాప్రతినిధులు హస్తం, కమలం పార్టీల గూటికి చేరారు. జెడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి, శిక్షణ తరగతుల జిల్లా అధ్యక్షుడు పురుషోత్తం రెడ్డి బీజేపీలో చేరగా, గోపాల్ పేట జెడ్పీటీసీ మంద భార్గవి కోటేశ్వర్‌రెడ్డితో పాటుగా వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని 10 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్‌లో చేరారు. 

బీఆర్‌ఎస్ బాటలోనే.. 

వనపర్తి నియోజకవర్గంలో 2014లో స్వల్ప మెజార్టీతో ఓడిపోయిన సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి.. మాజీ సీఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడు కావడంతో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడి పదవి ఇచ్చారు. దీంతో అప్పటి నుంచి నియోజకవర్గంలో పట్టుసాధించిన నిరంజన్‌రెడ్డి 2018 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి వ్యవసాయశాఖ మంత్రిగా పనిచేశారు. ఈ క్రమం లో నియోజకవర్గంలోని 7 మండలాలకు చెందిన టీడీపీ, కాంగ్రెస్ నాయకులను, కౌన్సిలర్లు, కార్యకర్తలను పెద్ద ఎత్తున బీఆర్‌ఎస్‌లోకి చేర్చుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో రాజకీయ సమీకరణాలు మారాయి. ఎమ్మెల్యేగా కాంగ్రెస్ అభ్యర్థి తూడి మేఘారెడ్డి గెలవడం, మాజీ మంత్రి చిన్నారెడ్డికి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్ష పదవి రావడంతో బీఆర్‌ఎస్ పార్టీలో ఉన్న ముఖ్య నాయకులు, కౌన్సిలర్లు, కార్యకర్తలు ఒక్కొక్కరుగా బీఆర్‌ఎస్‌ను వీడుతూ కాంగ్రెస్‌లోకి చేరుతున్నారు.   

వనపర్తి మున్సిపాలిటీ హస్తగతం.. 

2019లో జరిగిన వనపర్తి మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 33 వార్డులు ఉండగా 23 మంది బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు గెలిచారు. ఐదుగురు కాంగ్రెస్ కౌన్సిలర్లు, మిగతావారు ఇతర పార్టీల నుంచి గెలిచారు. అయితే 2023 ఎన్నికల సమయంలో ఇద్దరు బీఆర్‌ఎస్, ఇద్దరు బీజేపీ, ఒక టీడీపీ కౌన్సిలర్ కాంగ్రెస్‌లో చేరారు. ఇటీవల మరో 8 మంది బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్‌లోకి వెళ్లడంతో బలం 18కి చేరింది. దీంతో వనపర్తి మున్సిపాలిటీ హస్తగతమైంది. మరో ఏడుగురు కౌన్సిలర్లు సైతం బీజేపీ లేదా కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం ప్రజల్లో నడుస్తోంది.