19-12-2025 05:41:37 PM
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి
హనుమకొండ,(విజయక్రాంతి): శాస్త్ర, సాంకేతిక రంగాలలో భారతదేశం మరింత అభివృద్ధి చెందాలని,అప్పుడే విశ్వ గురువుగా కీర్తించబడుతుందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి అన్నారు.పాఠశాల విద్యాశాఖ, హనుమకొండ జిల్లా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి విద్యా,వైజ్ఞానిక ప్రదర్శనను శుక్రవారం హనుమకొండ లోని సెయింట్ పీటర్స్ ఎడ్యు స్కూల్ ఆవరణలో ఆయన దీప ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్. వి. గిరిరాజ్ గౌడ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచ దేశాలతో, అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడాలంటే శాస్త్ర, సాంకేతిక రంగాలలో మరింత పురోభివృద్ధి అవసరం అన్నారు. చైనా వ్యవసాయ రంగంలోకన్నా కూడా పారిశ్రామికరంగ అభివృద్ధితోనే ప్రపంచాన్ని శాసిస్తున్నదన్నారు. స్వాతంత్రం వచ్చాక మొట్టమొదటి ప్రధాని నెహ్రూ తన డిస్కవరీ ఆఫ్ ఇండియాలో భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశంగా గుర్తింపున్నా శాస్త్ర, సాంకేతిక రంగాలలో అభివృద్ధి చెందితేనే అభివృద్ధి సాధిస్తుందని పేర్కొంటూ ఇంజనీరింగ్ కళాశాలలను, పరిశ్రమలను ఏర్పాటు చేశారన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యా కమిషన్ ను ఏర్పాటు చేసి వచ్చే ఏడాది నుండి నూతన విద్యా ప్రణాళికను ప్రారంభించబోతున్నారన్నారు.
విద్యా,వైజ్ఞానిక ప్రదర్శనకు విద్యార్థులు తీసుకువచ్చే ప్రదర్శనలు సృజనాత్మకతతో కూడిన కొత్త ఆలోచనలతో ఉండాలన్నారు. అప్పుడే మంచి శాస్త్ర,సాంకేతిక రంగానికి బాటలు వేసిన వారవుతారన్నారు. విద్యార్థుల పరిశోధనలే దేశ ప్రగతికి సోపానాలు అవుతాయని ఆయన పేర్కొన్నారు. జిల్లాస్థాయి నుండి 12 ఎగ్స్ బిట్స్ రాష్ట్రస్థాయి ప్రదర్శనకు గత సంవత్సరం ఎంపికకావడం అభినందనీయమన్నారు. ప్రస్తుత వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే జిల్లా సైన్స్ సెంటర్ అభివృద్ధికి పది కోట్ల నిధులు మంజూరయ్యేలా కృషి చేశారని, సి.డి.ఎఫ్ నిధులు లేకున్నా తాను ముఖ్యమంత్రితో మాట్లాడి స్పెషల్ డెవలప్మెంట్ నిధులు మరిన్ని మంజూరు చేయించి మళ్లీ వచ్చే సైన్స్ ఫెయిర్ నాటికి జిల్లాసైన్స్ కేంద్రం అభివృద్ధికి తోడ్పడతానన్నారు.
గౌరవ అతిథిగా పాల్గొన్న సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ సైన్స్ ఫెయిర్ అంటే ఒక మోడల్ ను, ఒక ఎగ్జిబిట్ ను ప్రదర్శించడం కాదని, పరస్పరం విజ్ఞానాన్ని షేరింగ్ చేసుకోవడం అన్నారు. విద్యార్థులను రీసెర్చ్ స్కాలర్స్ గా, శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దడానికి సైన్స్ ఫెయిర్లు దోహదపడతాయన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు సైన్స్ పట్ల తరగతి గదిలో ప్రయోగాత్మకంగా ఆసక్తి కలిగించాలన్నారు. ప్రతి పాఠాన్ని ప్రయోగాత్మకంగా బోధించాలని సూచించారు. జిల్లా విద్యాశాఖ అధికారి గిరిరాజ్ గౌడ్ మాట్లాడుతూ విద్యార్థులు ఎప్పుడు కూడా కొత్త ఆలోచనలతో ప్రశ్నలు అడగాలని అన్నారు. తరగతి గదిలో ప్రశ్నించే తత్వాన్ని విద్యార్థులు అలవర్చుకోవాలని కోరారు.