5 July, 2026 | 2:24 AM

ఆర్‌ఎస్‌ఎస్ శిక్షణే కావాలంటున్నారు!

05-07-2026 12:00 AM
  1. పలుదేశాల నుంచి విజ్ఞప్తులు
  2. ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భగవత్

ముంబై, జూలై 4 (విజయక్రాంతి): ఆర్‌ఎస్‌ఎస్ (రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్) పనితీరును ప్రపంచమంతా ఆసక్తిగా గమనిస్తోందని, తమదేశంలో కూడా ప్రజలకు ఇలాంటి పనితీరుపై శిక్షణ ఇవ్వాలని పలు దేశాలు కోరుతున్నాయని సంస్థ అధినేత మోహన్ భగవత్ పేర్కొన్నారు. నాగ్‌పూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో భగవత్ మాట్లాడారు. సమాజంలో యువకులను ఉత్తమ సేవలందించేలా తీర్చిదిద్దడమే ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన లక్ష్యమని భగవత్ చెప్పారు.

ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు దేశం, సమాజం కోసం అంకితభావంతో ఏమీ ఆశించకుండా స్వచ్ఛందంగా ఎలా పనిచేస్తున్నారో ఐదుఖండాల ప్రముఖులు గమనిస్తున్నారని చెప్పారు. సమాజంలో ఆర్‌ఎస్‌ఎస్ పట్ల ఉన్న అనుమానాలు, అపోహలు తొలగిపోతున్నాయని, గౌరవం పెరుగుతోందన్నారు. సంస్థ ఎదుర్కొన్న అనేక కష్టనష్టాల చీకట్లు ఇప్పుడు తొలిగిపోతున్నాయని చెప్పారు. విద్యాసంస్థలను ఆర్‌ఎస్‌ఎస్ నియంత్రిస్తుందనే వాదనలను తిరస్కరించారు.

సంఘ్‌కు కేవలం అంకితభావంతో పనిచేసే వ్యక్తులే అవసరమని అన్నారు. విలువలతో కూడిన జీవితాన్నే ఆర్‌ఎస్‌ఎస్ నేర్పొస్తుందన్నారు. సమాజంలోని అన్నివర్గాలను ఏకం చేయడమే ఆర్‌ఎస్‌ఎస్ లక్ష్యమన్నారు. 1947 విభజన తర్వాత పాకిస్థాన్ నుంచి భారతదేశానికి వచ్చిన వారిని శరణార్థులు అని పిలవడం సరికాదని, వారు తరతరాలుగా నిర్మించుకున్న భూమి, వ్యాపారాలు, ఆస్తులను వదులుకున్న పోరాట యోధులని మోహన్ భగవత్ స్పష్టం చేశారు.