3 August, 2026 | 2:03 PM

రేవ్ పార్టీలో హేమ

22-05-2024 01:25 AM

ఆమెతో పాటు మరో 100 మంది 

ఐదుగురిపై కేసు నమోదు 

బెంగళూరు సీపీ దయానంద్ వెల్లడి

న్యూఢిల్లీ, మే 21: బెంగళూరు శివారులోని ఓ ఫామ్‌హౌస్‌లో నిర్వహించిన రేవ్ పార్టీకి సంబంధించి బెంగళూరు సిటీ పోలీస్ కమిషనర్ బీ దయానంద్ కీలక విషయాలు వెల్లడించారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ‘సన్ సెట్ టు సన్‌రైజ్’ పేరుతో నిర్వహించిన రేవ్ పార్టీలో 101 మంది పాల్గొన్నారని తెలిపారు. వారిలో నటి హేమ కూడా ఉన్నట్లు చెప్పారు. హైదరాబాద్‌కు చెందిన వాసు అనే వ్యక్తి పుట్టినరోజు సందర్భంగా ఈ పార్టీ ఏర్పాటు చేసినట్లు గుర్తించామని, పార్టీలో ఎక్కువ మంది తెలుగు రాష్ట్రాల వారే ఉన్నట్లు వెల్లడించారు.

రేవ్ పార్టీపై సీసీబీ పోలీసులు దాడి చేయగా డ్రగ్స్ పట్టుబడ్డాయని తెలిపారు. పార్టీలో పాల్గొన్న అందరి రక్త నమూనాలు సేకరించామని.. ఎవరెవరు డ్రగ్స్ తీసుకున్నారో రిపోర్ట్స్ వచ్చాక తెలుస్తుందని పేర్కొన్నారు. కాగా రేవ్ పార్టీపై పోలీసులు దాడి చేసిన సమయంలో నిర్వాహకులు తప్పించుకునే ప్రయత్నం చేశారని.. డ్రగ్స్ దొరకకుండా స్విమ్మింగ్ పూల్స్, ప్రహరీ వెలుపల పడేశారని, డాగ్ స్కాడ్ ద్వారా డ్రగ్స్‌ని గుర్తించామని చెప్పారు. ప్రస్తుతం ఐదుగురిపై కేసు నమోదు చేశామని.. రేవ్ పార్టీకి సంబంధించి ఇంకా విచారణ జరుగుతోందని సీపీ ప్రకటించారు. 

హేమ ఉన్నారు..

రేవ్ పార్టీలో టాలీవుడ్ నటి హేమ పాల్గొన్నట్లు సీపీ దయానంద్ స్పష్టం చేశా రు. ఆ పార్టీలో తాను లేనని తెలుపుతూ హేమ సోమవారం ఓ వీడియో విడుదల చేయగా.. ఆ వీడియో ఎక్కడి నుంచి తీశారో విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. రేవ్ పార్టీలో ప్రజాప్రతినిధులు ఎవరూ పాల్గొనలేదని కమిషనర్ వెల్లడించారు.

పలువురు ప్రముఖులు..

ఈ రేవ్ పార్టీకి సంబంధించి తెలుగు రాష్ట్రాల నుంచి రాజకీయ నేతలు, చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు, క్రికెట్ బుకీలు హాజరైనట్లు సమాచారం. మొత్తం 30 మంది మహిళలు పాల్గొనగా.. అందులో 25 మంది యువతులు ఉన్నారు. ఇక ఈ పార్టీలో 45 గ్రాములు ఎండీఎంఏ, కొకైన్‌తో పాటు 18 లగ్జరీ కార్లను పోలీసులు సీజ్ చేశారు. పోలీసులు సీజ్ చేసిన ఓ కారుపై ఏపీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పేరుతో ఎమ్మెల్యే స్టిక్కర్ అతికించి ఉన్నట్లు గుర్తించారు.