calender_icon.png 22 January, 2026 | 3:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రమాదాల నివారణకు సహకరించండి

22-01-2026 12:11:26 AM

  1. కారణాల విశ్లేషణకే రోడ్డు భద్రత కమిటీలు...

సీపీ అంబర్ కిషోర్ ఝా

మంచిర్యాల, జనవరి 21 (విజయక్రాంతి) : రోడ్డుపై ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరు సహకరించాలని, నిర్లక్ష్యపు చర్యలతోనే ప్రమాధాలు సంభవిస్తున్నాయని రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా పేర్కొన్నారు. బుధవారం మంచిర్యాల డీసీపీ కార్యాలయంలో రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా చేపట్టిన అరైవ్‌అలైవ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై డీసీపీ ఎగ్గడి భాస్కర్ తో కలిసి మాట్లడారు. రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం వ్యక్తిగత బాధ్యత మాత్రమే కాకుండా, సమాజానికి సంబంధించిన అంశమని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరిస్తే ప్రమాదాలను తగ్గించవచ్చన్నారు.

ప్రమాదాల రహిత కమిషనరేట్గా తీర్చిదిద్దేందుకు మూడు (ఇంజనీరింగ్, ఎడ్యుకేషన్ (అవగాహన), ఎన్ఫోర్స్మెంట్ (కఠినంగా అమలు) ) విధానాలను అమలు చేస్తున్నామని, దీనిని మారుమూల ప్రాంతాలకు చేరేలా చూడాలన్నారు. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనల వల్లే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూ, ప్రమాదాల నివారణలో భాగస్వాములు కావాలని సూచించారు.

మానవ తప్పిదాలే రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణమని, అందుకే పట్టణాలు, గ్రామాల్లో రోడ్డు భద్రత కమిటీలను ఏర్పాటు చేశామని, ప్రమాదం జరిగిన ప్రదేశాలను కమిటీ సభ్యులు పరిశీలించి, ప్రమాదానికి గల కారణాలను విశ్లేషించి, ఆ ప్రాంతంలో మళ్లీ ప్రమాదాలు జరగకుండా అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసి తగిన చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. అనంతరం అంబర్ కిషోర్ ఝా చేతుల మీదుగా అరైవ్‌అలైవ్ వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ అధ్యక్షతన ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, సీఐలు ప్రమోద్ రావు, అశోక్, శ్రీలత, నరేష్ కుమార్, ఎస్త్స్రలు తదితరులు పాల్గొన్నారు.