28 June, 2026 | 12:00 AM

పెంచిన ధరలను వెంటనే తగ్గించాలి - సిపిఐ

06-05-2026 07:21 PM

* తహసిల్దార్ కి వినతి పత్రం అందజేస్తున్న సిపిఐ నాయకులు

గరిడేపల్లి,(విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరను వెంటనే తగ్గించాలని జిల్లా కార్యవర్గ సభ్యులు పోకల వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. పెంచిన ధరలకు నిరసనగా సిపిఐ జాతీయ సమితి పిలుపుమేరకు మండల సిపిఐ ఆధ్వర్యంలో గ్యాస్ బండలతో నిరసన వ్యక్తం చేసి, బుధవారం తాసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చేవరకు వేచి చూసి ఫలితాలు రావడంతోనే కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం పెట్రో ఉత్పత్తుల తోపాటు గ్యాస్ ధరలను పెంచి పేద ప్రజలపై పెను భారం మోపిందని ఆరోపించారు.

దేశం వెలిగిపోతుందని పేదరికం లేని దేశంగా భారత్ అభివృద్ధి చెందుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారంలో ఈ విదేశీ పర్యటనలో మాట్లాడిన మాటలు అన్ని నీటి బుడగలేనని తేలిపోయిందన్నారు. దేశం వెలిగిపోతుంది అంటే పెట్రోలు, డీజిల్,గ్యాస్ ధరలు పెంచి పేద ప్రజల నడ్డి విరచడమేనా అని ఆయన ప్రశ్నించారు. అన్నింటి ధరలను విపరీతంగా పెంచి పేద ప్రజలను అణిచివేతకు గురిచేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విదేశీ పెట్టుబడిదారీలకు, దేశంలోని కార్పొరేట్ శక్తులకు,బడా బుర్జువా, భూస్వామ్య వ్యవస్థకు తలవంచిన నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజలను అన్ని రకాలుగా అణిచివేతకు గురి చేస్తున్నారని విమర్శించారు.

సామాన్య ప్రజలు,కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్రం పట్టించుకోకుండా నిత్యవసర వస్తువుల ధరలను పెంచి ప్రజలపై ఆర్థిక భారాన్ని మోపుతున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.అనంతరం తహసిల్దార్ స్రవంతికి వినతిపత్రం అందజేశారు.కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి కడియాల అప్పయ్య,ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి త్రిపురం సుధాకర్ రెడ్డి, సిపిఐ మండల కార్యవర్గ సభ్యులు ఎడ్ల అంజన్ రెడ్డి, చెవ్వ వెంకన్న, కుందూరు వెంకటరెడ్డి, షేక్ నబీ సాహెబ్, కొత్తపల్లి నర్సయ్య, వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.