7 August, 2026 | 9:45 AM

కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా సీపీఐ పాదయాత్ర

07-08-2026 08:49 AM

కమ్యూనిస్టుల ధ్యేయం

జవహర్ నగర్,(విజయక్రాంతి): ప్రజా సమస్యల పరిష్కారానికి రాజీలేని పోరాటమే కమ్యూనిస్టుల ప్రధాన ధ్యేయమని సీపీఐ మేడ్చల్ నియోజకవర్గ ఇన్‌చార్జి తోటపల్లి శంకర్ అన్నారు. సీపీఐ జాతీయ సమితి పిలుపు మేరకు కాప్రా మండల సమితి ఆధ్వర్యంలో గురువారం జవహర్ నగర్ కోళ్ల ఫారం బస్‌స్టాప్ నుంచి అంబేద్కర్ కూడలి వరకు కరపత్రాలు పంచుతూ పాదయాత్ర నిర్వహించారు.

ఈ సందర్భంగా తోటపల్లి శంకర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ అనుకూల విధానాలు అవలంబిస్తూ ప్రజలపై ధరల భారం, నిరుద్యోగం, ప్రైవేటీకరణను పెంచుతోందని విమర్శించారు. నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణ, ప్రభుత్వ విద్యా–వైద్య రంగాల బలోపేతం, ఖాళీ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, మహిళల భద్రత, కార్మిక–రైతు హక్కుల పరిరక్షణ కోసం ఆగస్టు 6 నుంచి 14 వరకు జవహర్ నగర్ 2వ డివిజన్‌లో పాదయాత్రలు కొనసాగుతాయని తెలిపారు.

కాప్రా మండల కార్యదర్శి దర్శనం యాదగిరి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సీపీఐ సీనియర్ నాయకుడు సీహెచ్ దశరథ్, జిల్లా సమితి సభ్యుడు నిమ్మల నరసింహులు, గిరిజన సమాఖ్య జిల్లా కార్యదర్శి వి. స్వరూప్ నాయక్, ఏఐటీయూసీ మండల అధ్యక్షుడు అంబాల ఎల్లయ్య, మహిళా సమాఖ్య మండల అధ్యక్షురాలు కోదాసు జయమ్మ, నాయకులు పి. నరసింహ, బాష్యం పల్లి వెంకటాద్రి, సీహెచ్ మాధవి, డి. మల్లిక, నాగేష్, పి. ఎల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.