12 June, 2026 | 6:22 PM

చెంచు గిరిజనుల అభివృద్ధికి శాఖల సమన్వయం తప్పనిసరి

12-06-2026 05:44 PM

* విద్య, వైద్యం, తాగునీరు, ఉపాధి అంశాలపై ప్రత్యేక దృష్టి

* ఐటీడీఏ సమీక్షలో జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్

అచ్చంపేట: మన్ననూరు ఐటీడీఏ ప్రాజెక్టు పరిధిలో అమలవుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ‌ అభివృద్ధి, సంక్షేమ పథకాలు గిరిజనుల(చెంచు)కు ప్రతి ఒక్కరికి అందేలా చూడాలని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ పాటిల్ సూచించారు. శుక్రవారం మన్ననూరులోని ఐటీడీఏ కార్యాలయంలో ఐటీడీఏ కార్యక్రమాల అమలుపై ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. గిరిజనుల జీవన ప్రమాణాలను మెరుగుపర్చడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఆదివాసులు నివసించే చెంచుపెంటల్లో అమలవుతున్న కార్యక్రమాల పురోగతిని శాఖల వారీగా అడిగి తెలుసుకున్నారు.

కలెక్టర్ మాట్లాడుతూ.. చెంచు గిరిజనులు, అత్యంత వెనుకబడిన గిరిజన వర్గాలవారి అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతోందని,  చెంచు కుటుంబాలకు విద్య, ఆరోగ్యం, తాగునీరు, పోషకాహారం,  వనరులు, విద్యుత్, ఉపాధి అవకాశాలు వంటి ప్రాథమిక సౌకర్యాలు పూర్తిస్థాయిలో అందేలా అధికారులు క్షేత్రస్థాయిలో నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. చెంచు పెంటల్లోని పిల్లలందరూ తప్పనిసరిగా పాఠశాలలకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థుల హాజరు శాతం, వసతి గృహాల నిర్వహణ, మధ్యాహ్న భోజన పథకం అమలు, డ్రాప్‌అవుట్‌ల నివారణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, చెంచు విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేలా ప్రోత్సాహక కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.

* వైద్య సేవలపై ప్రత్యేక దృష్టి

గిరిజన ప్రాంతాల్లో ఆరోగ్య సేవలు అందుతున్న తీరును పరిశీలించారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అవసరమైన వైద్య సేవలు, టీకాలు, పోషకాహార కార్యక్రమాలు క్రమం తప్పకుండా అందేలా చూడాలని, ప్రతి చెంచు పెంటకు ఆరోగ్య సిబ్బంది క్రమం తప్పకుండా వెళ్లి వైద్య సేవలు అందించడంతో పాటు సీజనల్ వ్యాధుల నివారణకు చర్యలు చేపట్టాలని వైద్య అధికారులను ఆదేశించారు. ఎక్కడా తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అన్నారు. పనిచేయని బోర్లు, పైపులైన్లు, నీటి సరఫరా వ్యవస్థలను వెంటనే మరమ్మతు చేసి ప్రజలకు నిరంతర నీటి సరఫరా కల్పించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.

* యువతకు స్కిల్ డెవలప్మెంట్ పై అవగాహన

చెంచు యువత ఉపాధి అవకాశాల పెంపుపై ప్రత్యేకంగా దృష్టి సారించిన కలెక్టర్, స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాలను విస్తృతంగా అమలు చేయాలని సూచించారు. యువతకు మార్కెట్ అవసరాలకు అనుగుణంగా నైపుణ్య శిక్షణ అందించి ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని తెలిపారు. ప్రభుత్వ శాఖలు, ఐటీడీఏ, ఇతర సంస్థల సహకారంతో చెంచు యువతకు ఉపాధి కల్పనకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి అవసరమైన చోట్ల సోలార్ పంప్ సెట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. అటవీ ప్రాంతాల్లో నివసిస్తున్న చెంచు కుటుంబాలకు ఉపాధి, జీవనోపాధి అవకాశాల పెంపు కోసం లైవ్లీహుడ్ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని చెప్పారు.

గిరిజన ప్రాంతాల్లో విద్యుత్ సౌకర్యాల విస్తరణలో భాగంగా ఇందిరా సౌర గిరిజల విద్యుత్ పథకం అమలుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి అందరికీ చేరేలా ఆధార్ నమోదు, ఆధార్ అప్‌డేట్, ఆధార్‌కు మొబైల్ నంబర్ అనుసంధానం, ఆధార్ ఆధారిత సేవలు సులభంగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

* రేషన్ కార్డుల సమస్యలు, ఆధార్ సంబంధిత ఇబ్బందులు, ఇతర ప్రభుత్వ సేవలకు సంబంధించిన అంశాల పరిష్కారం కోసం ప్రత్యేక సేవా కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా మొబైల్ నెట్‌వర్క్ అందుబాటులో ఉన్న చెంచు పెంటలను గుర్తించి అక్కడ సేవా కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు.

నెట్‌వర్క్ సౌకర్యం లేని ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేందుకు తాత్కాలిక (టెంపరరీ) సేవా కేంద్రాలను ఏర్పాటు చేసి, ఆధార్, రేషన్ కార్డు, ప్రభుత్వ ధ్రువపత్రాలు తదితర సేవలు సకాలంలో అందేలా చూడాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. చెంచులకు అమలవుతున్న సంక్షేమ పథకాలు, గృహనిర్మాణం, అభివృద్ధి పనులు ,విద్యుత్, పోషకాహార కార్యక్రమాలు, అంగన్‌వాడీ సేవలు, జీవనోపాధి పథకాల పురోగతిని కూడా సమీక్షించారు. అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు చేరేలా అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి కార్యక్రమం చివరి వ్యక్తి వరకు చేరినప్పుడే ఆశించిన ఫలితాలు వస్తాయని పేర్కొన్న కలెక్టర్, శాఖల మధ్య సమన్వయం పెంచుకొని చెంచు గిరిజనుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని  సూచించారు. అధికారులు తరచూ క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా అటవీ శాఖ అధికారి రేవంత్ చంద్ర, ఇంచార్జ్ డిటిడబ్ల్యుఓ ఉమాపతి, పిడి డిఆర్డిఏ చిన్న ఓబులేసు, మిషన్ భగీరథ ఈఈ హేమలత ఐటీడీఏ ప్రాజెక్టు మేనేజర్ జాఫర్ హుస్సేన్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.