బాల కార్మిక వ్యవస్థను నిర్మూలిద్దాం
- ప్రజలకు జిల్లా కలెక్టర్ చిత్ర మిశ్రా పిలుపు
ముకరంపుర,(విజయక్రాంతి): బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ చిత్ర మిశ్రా పిలుపునిచ్చారు. ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకొని శుక్రవారం కలెక్టరేట్ లోని తన చాంబర్ లో కార్మిక శాఖ రూపొందించిన పోస్టర్ ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 14 ఏళ్లలో పిల్లలను పనిలో పెట్టుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వారు పాఠశాలకు వెళ్లి చదువుకునేలా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు. బాల కార్మికులు కనిపిస్తే అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ కోలా ప్రసాద్, కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్ వెంకటరమణ పాల్గొన్నారు.






