17 May, 2026 | 4:01 AM

క్రిమినల్, శాఖాపర విచారణలు వేర్వేరు

23-04-2024 01:11 AM

ఓయూ ఫండ్స్ దుర్వినియోగంపై శిక్ష రద్దు 

20 ఏళ్ల నాటి కేసులోతీర్పునిచ్చిన హైకోర్టు

హైదరాబాద్, ఏప్రిల్‌ (విజయక్రాంతి): క్రిమినల్ కేసుల విచారణ, శాఖాపరమైన విచారణ వేర్వేరని హైకోర్టు స్పష్టం చేసింది. శాఖాపర విచారణ నివేదిక ఆధారంగా క్రిమినల్ కేసు విచారణ చేయడానికి వీల్లేదని తేల్చిచెప్పింది. దీని ఆధారంగా క్రిమినల్ కేసు విచారణ పూర్తి చేసి అభియోగాలు నిర్ధారించడానికి వీల్లేదన్నది.  నిందితులు తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలనడం చట్ట వ్యతిరేకమని వెల్లడించింది. క్రిమినల్ కేసు విచారణ బాధ్యత పూర్తిగా ప్రాసిక్యూషన్‌పై ఆధారపడి ఉంటుందని చెప్పింది. బ్యాంకుల నుంచి నిధులను డ్రా చేశారనడానికి బ్యాంకు నుంచి ఎలాంటి సాక్ష్యం లేకుండా నిందితులకు కింది కోర్టు శిక్ష విధించడాన్ని రద్దు చేసింది. ఉస్మానియా యూనివర్శిటీలో నిధుల దుర్వినియోగానికి సంబంధించి 20 ఏళ్ల క్రితం నమోదైన కేసులో ఆరుగురికి ఏసీబీ కోర్టు విధించిన ఏడాది శిక్షను హైకోర్టు రద్దు చేసింది. వాళ్లను నిర్దోషులుగా ప్రకటించింది.

ఓయూలో ఓవర్ టైమ్, ప్రింటింగ్ స్టేషనరీ, ప్రెస్ ఎక్యూప్మెంట్ కొనుగోళ్లలో రూ.1.59 కోట్ల దుర్వినియోగం జరిగిందని పేర్కొంటూ ఓయూ రిజిస్ట్రార్ 1993లో ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఏసీబీ 1994లో నమోదు చేసిన కేసులో 11 మంది నిందితులను చేర్చింది. 2007లో ఏసీబీ కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. ఆ కేసు విచారణలో ఉండగా ఇద్దరు మరణించారు. ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పును మిగిలినవారు హైకోర్టులో సవాల్ చేశారు. అప్పీళ్లను ఆమోదిస్తూ, ఏసీబీ కోర్టు తీర్పును కొట్టేస్తూ జస్టిస్ కే సురేందర్ ఇటీవల తీర్పు చెప్పారు. రెండు అల్మారాల్లోని డాక్యుమెంట్ల ఆధారంగా ఇద్దరు తయారు చేసిన రిపోర్టుల ఆధారంగా ఏసీబీ కోర్టు విధించిన శిక్ష చెల్లదని చెప్పారు. శాఖాపరమైన విచారణలో నిందితుల్లో కొంత మందిని మాత్రమే విచారణ చేపట్టి నివేదిక రూపొందించారని ఆక్షేపించారు. శాఖాపరమైన విచారణకు క్రిమినల్ కేసుల్లో విచారణకు తేడా ఉంటుందని తీర్పులో వివరించారు.