అభివృద్ధిని అడ్డుకునే విమర్శలు మానుకుని సహకరించాలి
మధిర,(విజయక్రాంతి): మున్సిపాలిటీ అభివృద్ధిపై బీఆర్ఎస్ నాయకులు లింగాల కమల్ రాజ్ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని, అవి కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే చేస్తున్న విమర్శలని మధిర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పారుపల్లి విజయ్ కుమార్ పేర్కొన్నారు. శనివారం పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ... మధిర పట్టణ అభివృద్ధిని వేగవంతం చేయడానికి ప్రజాప్రతినిధులు, అధికారులు, నిపుణుల సూచనలతో ఏర్పాటు చేసిన డెవలప్‌మెంట్ కమిటీ కేవలం సలహాలు, సమన్వయం కోసం మాత్రమే పనిచేస్తోందని ఆయన తెలిపారు.
ప్రజలు ఎన్నుకున్న కౌన్సిలర్ల అధికారాలను తగ్గించే ఉద్దేశం ఎక్కడా లేదని, ప్రతి నిర్ణయం ప్రజాస్వామ్యబద్ధంగానే తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. ప్రోటోకాల్ గురించి ప్రస్తుతం బీఆర్ఎస్ నాయకులు మాట్లాడటం ఆశ్చర్యకరమని విమర్శించారు. వారి పాలనలో జిల్లా పరిషత్ చైర్మన్‌గా ఉన్న సమయంలో మున్సిపాలిటీలో ప్రోటోకాల్ పాటించకుండానే కార్యక్రమాలు నిర్వహించిన సందర్భాలు అనేకం ఉన్నాయని గుర్తుచేశారు.
పదేళ్ల పాటు ప్రజా సమస్యలు పరిష్కారం కాకుండా పెండింగ్‌లో ఉండగా, నేడు అభివృద్ధి పనులు ప్రారంభించిన కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నమేనన్నారు. మధిర అభివృద్ధి విషయంలో ఎవరినీ పక్కన పెట్టే ఉద్దేశం లేదని, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు అందరినీ భాగస్వామ్యం చేస్తూ పట్టణాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని పారుపల్లి విజయ్ కుమార్ పేర్కొన్నారు.ఈ సమావేశంలో మధిర పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.






