ఫసల్ భీమా యోజనను అమలు చేయాలి
కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పాయల్ శంకర్
ఆదిలాబాద్, మార్చి 2 (విజయక్రాంతి): రైతులు తాము పండించిన పంట అమ్మకాల్లో మధ్యవర్తుల చేతిలో నష్టపోకుండా తమ పంటను తప్పనిసరిగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలోనే విక్రయించూసుకోవాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ సూచించారు. సోమవారం జైనథ్‌లోని మార్కెట్ యార్డ్‌లో ఏర్పాటు చేసిన రెడ్గ్రామ్ (కందులు) ప్రభుత్వ కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ముందుగా మార్కెట్ కు తొలి పంట ను తీసుకొచ్చిన రైతును శాలువాతో సత్కరించి, తూకం కాంటాల కు పూజలు చేసి కొనుగోళ్లు లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ... ఈ ఏడాది వరదలు, అకాల వర్షాల కారణంగా రైతులు తీవ్రమైన నష్టాలను ఎదుర్కొంటున్నారని, రైతుల కష్టాలను ప్రభుత్వం గుర్తించి వారికి పూర్తి స్థాయి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో రైతులకు రక్షణ కల్పించేందుకు ఫసల్ భీమా యోజన అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశాన్ని బలంగా ప్రస్తావిస్తూ, రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి రైతుల నుంచి 10 లక్షల వినతిపత్రాలు సేకరించి సమర్పిస్తానని ఎమ్మెల్యే ప్రకటించారు.
రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి రైతు ఫసల్ భీమా యోజన అమలుకు జరిగే ఉద్యమంలో పాల్గొని ఐక్యంగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ అశోక్ రెడ్డి, గ్రామ సర్పంచ్ మమత జగదీష్ రెడ్డి, ఉప సర్పంచ్ పిడుగు స్వామి యాదవ్, బీజేపీ నాయకులు, మార్కెట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.




