18 July, 2026 | 5:06 PM

పేదలకు 3 కోట్ల ఇళ్లు

11-06-2024 01:51 AM

మోదీ 3.0 తొలి క్యాబినెట్ భేటీలో నిర్ణయం

ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిర్మాణం

పట్టణ, గ్రామీణ లబ్ధిదారులకు ప్రయోజనం

2047 నాటికి వికసిత్ భారతే లక్ష్యం..

నేను అధికారం కోసం పుట్టలేదు.. 

నాకు అధికారంపై మక్కువ లేదు..

పీఎంవో అధికారులతో ప్రధాని మోదీ సమావేశం

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి విడుదలపై తొలి సంతకం

న్యూఢిల్లీ, జూన్ 10: మోదీ 3.0 ప్రభుత్వం పరుగులు తీస్తోంది. ప్రమాణస్వీకారం చేసిన మరుసటి రోజే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన మంత్రి వర్గం సమావేశమైంది. ప్రధాని మోదీ నివాసంలో ఈ క్యాబినెట్ భేటీ జరిగింది. క్యాబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ పథకం కింద గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పేదలకు అదనంగా 3 కోట్ల ఇళ్లు నిర్మించి ఇవ్వాలని నిర్ణయించారు.

అర్హులైన గ్రామీణ, పట్టణ లబ్ధిదారులకు నివాసయోగ్యమైన ఇల్లుతో పాటు మౌలిక సదుపాయా లు కల్పించే ఉద్దేశంతో 2015 ఆర్థిక సంవత్సరం నుంచి పీఎం ఆవాస్ యోజనను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. గత పదేళ్లుగా 4.21 కోట్ల ఇళ్లు నిర్మించి అర్హులైన పేదలకు అప్పజెప్పారు. ఇళ్లు నిర్మించడంతో పాటు వారికి మౌలిక సదుపాయాలైన టాయిలెట్లు, ఎల్పీజీ కనెక్షన్, విద్యుత్ కనెక్షన్, నల్లా నీరు అందిస్తారు. 

పీఎం కిసాన్ నిధిపై తొలి సంతకం

మూడోసారి ప్రధాని అయిన తర్వాత రైతుల సంక్షేమానికి సంబంధించి మోదీ తొలి నిర్ణయం తీసుకొన్నారు. పీఎం కిసాన్ నిధి ౧౭వ విడత నిధుల విడుదలకు సంబంధించిన ఫైల్‌పై సోమవారం సంతకం చేశారు. ఈ దఫాలో దాదాపు 9.3 కోట్ల రైతులకు రూ.20 వేల కోట్లు పెట్టుబడి సాయంగా వారి బ్యాంకు ఖాతాల్లో జమచేయనున్నారు.

రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని ప్రకటించారు. ‘మా ప్రభుత్వం రైతు సంక్షేమానికి పూర్తిగా కట్టుబడి ఉన్నది. అందుకే మూడోసారి అధికారంలోకి రాగానే మొదటి సంతకం రైతుల కు సంబంధించిన ఫైల్‌పైనే పెట్టాను. రైతుల కోసం మరింత కష్టపడి పనిచేస్తాం. వ్యవసాయాన్ని మరింత అభివృద్ధి చేస్తాం’ అని తెలిపారు. 

ప్రజల కోసమే పీఎంవో

ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ప్రధాని కార్యాలయం (పీఎంవో) అధికారులతో మోదీ తొలిసారిగా సమావేశంమ య్యారు. పీఎంవో అంటే ప్రజల కార్యాలయంలా ఉండాలి కానీ.. మోదీ పీఎంవోగా ఉండకూడదని హితవు పలికారు. చోదక శక్తిగా సేవలందించి మొత్తం వ్యవస్థకు కొత్త ఉత్సాహాన్ని అందించాలని సూచించారు. ‘పదేళ్ల కింద చూసుకుంటే దేశంలో అధికార కేంద్రంగా పీఎంవో ఉండేది. చాలా పెద్ద అధికార కేంద్రంగా ఉండేది. నేను అధికారం కోసం జన్మించలేదు. అధికారం చేపట్టాలని ఆలోచన కూడా లేదు’ అని పేర్కొన్నారు. 

అదొక్కటే లక్ష్యం.. 

‘2047 నాటికి భారత దేశాన్ని అభివృద్ధి చేయాలన్న ఏకైక లక్ష్యం నా ముందుంది. దేశమే ముఖ్యం అనేది మనందరి ఏకైక లక్ష్యం.. 2047 నాటికి వికసిత్ భారత్ చేయడమే మా అందరి ఏకైక ఉద్దేశం. నా జీవితంలో ప్రతిక్షణం దేశం కోసమే. ఈ విషయాన్ని ఇప్పటికే చెప్పాను. 2047 కోసం 24*7 కష్టపడుతానని మాటిచ్చాను. నా బృందం నుంచి ఇదే కోరుకుంటున్నా’ అని మోదీ పీఎంవో అధికారులకు వివరించారు. 

ఏది చేసినా వారి కోసమే..

ప్రధానమంత్రిగా దేశంలోని 140 కోట్ల ప్రజల కోసం తాను ఎంతో నిబద్ధతతో పనిచేస్తున్నానని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ‘నా గుండెల్లో 140 కోట్ల మంది భారతీయులు తప్ప మరెవరూ లేరు. వారంతా కేవలం ప్రజలే కాదు. భగవంతుడి స్వరూపాలు. ప్రభుత్వంలో ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పు డు ఇదే విషయాన్ని బలంగా నమ్ముతాను. 140 కోట్ల మంది ప్రజలను ఆరాధిస్తున్నట్టు భావిస్తుంటాను’ అని మోదీ చెప్పారు.

మనకు పని వేళలు ఉండవు.. 

‘ఫలానా సమయానికి స్టార్ట్ అయి.. ఫలానా టైంకు అయిపోయే ఆఫీసు కాదు మనది. మనకు పని వేళలు ఉండవు. మన ఆలోచనా శక్తికి ఎలాంటి పరిమితులు ఉండవు. దీన్ని మించి ఆలోచించిన వారే నా బృందంలో ఉన్నారు. దేశం నా టీంను నమ్ముతోంది’ అని ప్రధాని అన్నారు.