18 July, 2026 | 5:21 PM

లోక్‌సభ స్పీకర్ ఎవరు?

11-06-2024 01:47 AM

మాకే ఇవ్వాలంటున్న చంద్రబాబు

వదులుకోవటానికి సిద్ధంగా లేని మోదీ

ఎన్డీయే కూటమిలోఇప్పుడంతా ఇదే చర్చ

న్యూఢిల్లీ, జూన్ 10: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా మెజారిటీ రాకపోవటంతో ఎన్డీయే కూటమి మిత్రపక్షాల మద్దతుతో ఆగమేఘాలమీద మూడోసారి మోదీ ప్రధానిగా ప్రమాణం చేశారు. 72 మంది మంత్రులతో క్యాబినెట్ ఆదివారం కొలువుదీరింది. ఇప్పుడు అందరి దృష్టి లోక్‌సభ స్పీకర్ పదవిపై పడింది. 18వ లోక్‌సభ ప్రారంభం కాగానే స్పీకర్ పదవిని భర్తీ చేయాల్సి ఉన్నది. ఈ పోస్టు కోసం ఎన్డీయే మిత్రపక్షాలైన టీడీపీ, జేడీయూ పట్టుబడుతున్నట్టు సమాచారం. అయితే, స్పీకర్ పదవిని తనవద్దే ఉంచుకోవాలని బీజేపీ భావిస్తున్నట్టు తెలిసింది. దీంతో ఈ పోస్టు ఏ పార్టీకి దక్కుతుందనే చర్చ మొదలైంది.

బీజేపీకి అవసరం

గత పదేండ్లుగా లోక్‌సభలో బీజేపీకి సంపూర్ణ మెజారిటీ ఉన్నది. ప్రతిపక్షాలు చాలా బలహీనంగా ఉన్నాయి. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీకి 50 మంది ఎంపీలు కూడా లేరు. దీంతో ప్రతిపక్షమే లేని సభలో అధికార పక్షం తాము అనుకున్నదే చెల్లుబాటు అయ్యేలా రాజ్యమేలింది. అలాంటి పరిస్థితుల్లో స్పీకర్ పాత్రతో ప్రభుత్వానికి పెద్దగా అవసరం ఉండదు. కానీ, ఈసారి పరిస్థితి మారింది. బీజేపీకి మెజారిటీ రాలేదు. బీజేపీ మెజారిటీ మార్కుకు 32 స్థానాల వెనుకే ఆగిపోయింది. ఎన్డీయే కూటమితో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాల్సి వచ్చింది. ప్రధాని మోదీకి ఆయన కెరీర్‌లో ఎన్నడూ సంకీర్ణ ప్రభుత్వాలను నడిపిన అనుభవం లేదు.

మరోవైపు ఎన్డీయే ప్రభుత్వానికి జాకీలుగా మారిన టీడీపీ, జేడీయూ పార్టీల అధినేతలు చంద్రబాబు, నితీశ్‌కుమార్‌కు తమ రాజకీయ అవసరాలకు తగ్గట్టుగా రంగులు మార్చిన చరిత్ర ఉన్నది. తమ మాట చెల్లుబాటు కాని రోజు మరో ఆలోచన లేకుండా వాళ్లు కూటమికి గుడ్‌బై చెప్పినా చెప్తారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మోదీ సర్కారు సభలో తమ మాట నెగ్గించుకోవాలంటే బలమై, చతురత ఉన్న వ్యక్తి స్పీకర్ స్థానంలో కూర్చోవాలి. అసలే ప్రతిపక్ష ఇండియా కూటమి ఈసారి బలపడింది.

ఈ కూటమికి నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ పదేండ్ల తర్వాత దాదాపు 100 సీట్ల మార్కును చేరుకొన్నది. దీంతో సభలో మోదీ ప్రభుత్వాన్ని ముప్పు తిప్పులు పెట్టాలని ఉవ్విళ్లూరుతున్నది. కాంగ్రెస్ లోక్‌సభాపక్ష నేతగా రాహుల్‌గాంధీ ఉండాలని ఆ పార్టీ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) ఇటీవలే తీర్మానం కూడా చేసింది. భారత్ జోడోయాత్ర తర్వాత రాహుల్‌గాంధీలో రాజకీయ పరిణతి స్పష్టంగా కనిపిస్తున్నది. ఈ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొంటే ఈసారి లోక్‌సభలో స్పీకర్ పదవి చాలా కీలకం కానున్నది. 

స్పీకర్ పదవిపై టీడీపీ కన్ను

గతంలో ఎన్డీయే ప్రభుత్వంలో ఒకసారి టీడీపీకి స్పీకర్ పదవి దక్కింది. టీడీపీ నేత జీఎంసీ బాలయోగి 1998 మాచ్చి 24 నుంచి 2002 మార్చి 3 వరకు లోక్‌సభ స్పీకర్‌గా పనిచేశారు. లోక్‌సభకు తొలి దళిత స్పీకర్ కూడా ఈయనే. ఇన్నేళ్ల తర్వాత టీడీపీకి మళ్లీ కేంద్రంలో చక్రం తిప్పే అవకాశం రావటంతో స్పీకర్ పదవిపై మరోసారి కన్నేసినట్టు సమాచారం. 16 ఎంపీలున్న టీడీపీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో  అత్యంత కీలక భాగస్వామి. అందుకే తమకు 10 మంత్రి పదవులు కావాలని బీజేపీని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేసినట్టు మొదట వార్తలు వచ్చాయి.

కానీ, ఆదివారం నాటి ప్రమాణ స్వీకారంలో మాత్రం ఆ పార్టీకి రెండే పదవులు వచ్చాయి. స్పీకర్ పదవిని టీడీపీకి ఇవ్వటానికే మంత్రి పదవులను తగ్గించారా అనే చర్చ జరుగుతున్నది. రాజ్యాంగం ప్రకారం కొత్త లోక్‌సభ ప్రారంభమైన మొదటిరోజే లోక్‌సభ స్పీకర్ పదవి ఖాళీ అవుతుంది. కొత్త సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించేందుకు ప్రొటెంస్పీకర్‌ను రాష్ట్రపతి నియమిస్తారు. ఆ తర్వాత స్పీకర్‌ను ఎన్నుకోగానే ప్రొటెం స్పీకర్ పదవి రద్దవుతుంది. స్పీకర్‌ను సాధారణ మెజారిటీతో సభ ఎన్నుకొంటుంది. ఇందుకోసం ప్రత్యేక విధానమంటూ ఏమీ రాజ్యాంగంలో పేర్కొనలేదు. 

కీలకం స్పీకరే..

మోదీ రెండు టర్ముల్లో సుమిత్రా మహాజన్, ఓంబిర్లా లోక్‌సభ స్పీకర్లుగా వ్యవహరించారు. వీరిద్దరూ బీజేపీ నేతలే. గతానికి భిన్నంగా మోదీ జమానాలో సభలో సభ్యుల సస్పెన్షన్లు నిత్యకృత్యమయ్యాయనే విమర్శలున్నాయి. గతంలో ఏ అంశంపై అయినా నిరసన తెలుపాలనుకొంటే ప్రతిపక్ష సభ్యలు సభలో తమ స్థానాల్లో లేచి నిలబడటం, కొన్నిసార్లు వెల్‌లోకి వెళ్లటం, స్పీకర్ పోడియం వద్ద భైటాయించటం జరిగేది. కానీ, సభ్యులు అలాంటి చర్యలకు పాల్పడకుండా మోదీ సర్కారు కఠిన నిబంధనలు తెచ్చింది. ఇప్పుడు వెల్‌లోకి వెళ్లి నినాదాలు చేశారంటే స్పస్పెన్షన్ వేటు పడినట్టే. రాజ్యాంగం ప్రకారం స్పీకర్ పదవిలో ఉన్నవారు పూర్తి నిష్పక్షపాతంగా సభను నిర్వహించాలి.

స్పీకర్ పదవి చేపట్టిన తర్వాత కూడా పార్టీ సభ్యుడిగా ఉంటే ఎక్కడ పక్షపాతం చూపించాల్సి వస్తుందోనని గతంలో కొందరు పార్టీలకు రాజీనామా చేసినవారు కూడా ఉన్నారు. నీలం సంజీవరెడ్డి లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నికైన వెంటనే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. పీఏ సంగ్మా, సోమ్‌నాథ్ ఛటర్జీ, మీరా కుమార్ వంటివారు తమ పార్టీలకు రాజీనామాలు చేయకపోయినా సభలో అన్ని పార్టీలకు సమ ప్రాధాన్యం ఇచ్చి నిష్పక్షపాతంగా సమావేశాలను నిర్వహించారన్న ప్రశంసలు అందుకొన్నారు. యూపీఏ ప్రభుత్వం నుంచి వామపక్షాలు వైదొలిగి తర్వాత సోమ్‌నాథ్ ఛటర్జీని స్పీకర్ పదవికి రాజీనామా చేయాలని పార్టీ ఆదేశించినా ఆయన వినలేదు. తాను రాజకీయాలకు అతీతమైన స్పీకర్ పదవిలో ఉన్నానని తెగేసి చెప్పారు. విలువల కోసం ఆయన సీపీఎం పార్టీ నుంచి బహిష్కరణకు కూడా గురయ్యారు. 

ఫిరాయింపుల భయమేనా

లోక్‌సభ వరకు స్పీకరే సర్వాధికారి. ఆయన మాటకు తిరుగుండదు. పార్టీ ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోవటంలో కూడా ఆయన మాటే తుది తీర్పు లాంటిది. సుప్రీంకోర్టు, రాష్ట్రపతి కూడా స్పీకర్‌ను ఆదేశించే అవకాశాలు లేవు. అందుకే ఇప్పుడు ఎన్డీయే పార్టీల దృష్టి ఆ పోస్టుపై పడింది. గత పదేండ్ల చరిత్ర చూస్తే బీజేపీ తన రాజకీయ అవసరాల కోసం విపక్షాలతోపాటు మిత్రమపక్షాలు, మాజీ మిత్రపక్ష పార్టీలను కూడా నిలువునా చీల్చింది. మహారాష్ట్రలో శివసేన పరిస్థితే అందుకు ఉదాహరణ. ఇప్పుడు బీజేపీకి సంపూర్ణ మెజారిటీ లేకపోవటంతో ప్రభుత్వం గాడిలో పడిన వెంటనే సభలో మెజారిటీ పెంచుకోవటంపై దృష్టిపెట్టే అకాశం ఉన్నదని నిపుణులు అంచనా వేస్తున్నారు.

అందు లో భాగంగా ఆపరేషన్ లోటస్‌ను మళ్లీ ప్రారంభించే అవకాశం ఉన్నది. అదే జరిగితే విపక్షాల ఎంపీలు బీజేపీలోకి జంప్ అవుతారు. ఎన్డీయే మిత్ర పక్షాల ఎంపీలను కూడా లాగినా లాగవచ్చు. అలా కాకున్నా టీడీపీ ఏపీలో, జేడీయూ బీహార్‌లో ప్రతిపక్ష ఎంపీలను తమవైపు తిప్పుకొనేందుకు ప్రయత్నించ వచ్చు. ఈ రెండు సందర్భాల్లో పార్టీ ఫిరాయింపుల ఫిర్యాదులు వెళ్లేది స్పీకర్ ముందుకే. వాటి పరిష్కరించే క్రమంలో  స్పీకర్ పోస్టులో ఏ పార్టీ నేత ఉంటే.. ఆ పార్టీకే అనుకూలంగా నిర్ణయం వెలువడుతుందని కొత్తగా చెప్పనక్కర లేదు. అందుకే స్పీకర్ పదవి కోసం బీజేపీ, టీడీపీ, జేడీయూ అంత పట్టుదలగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.