బాసరకు 225 కోట్లు
- ఆలయ అభివృద్ధికి నిధులు విడుదల చేసిన ప్రభుత్వం
- నేడు పనులను ప్రారంభించనున్న సీఎం రేవంత్‌రెడ్డి
- మాస్టర్ ప్లాన్‌పై మంత్రులు, అధికారులు, పూజారులతో సమీక్ష
- ఆగమ శాస్త్రం ప్రకారం పనుల నిర్వహణ
- ప్రతి నిర్మాణం శిలలతోనే..
- ౨౦౨౭ గోదావరి పుష్కరాలను దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి
హైదరాబాద్/నిర్మల్, ఏప్రిల్ 5 (విజయక్రాంతి): దక్షిణ భారతదేశంలోని ఏకై క సరస్వతి నిలయమైన నిర్మల్ జిల్లా బాసర అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేక కృషితో సమగ్ర మాస్టర్ ప్లాన్‌కు రూ.225 కోట్లు విడుదలయ్యా యి. సోమవారం అభివృద్ధి పనులకు సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని మహా రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన బాసర గోదావరి ఒడ్డున ఈ ఆలయం ఉంది.
ఈ ఆలయంలో చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం చేస్తే వారు విద్యావంతులై ప్రయోజకులు అవుతారని భక్తుల విశ్వా సం. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్ తదితర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. అయితే ఆలయ గర్భ గుడితో పాటు అక్షర మండపాలు, కాళీమాత విగ్రహం, లక్ష్మీదేవి విగ్రహం, ఇరుకు క్యూ లైన్లు, కోనే రు, పుష్కర ఘాట్ల వద్ద కనీస సదుపాయాలు లేకపోవడం, ప్రమాదకరమైన పుష్కర ఘాట్లు, అన్నదాన మండపం, ధ్యాన మందిరం ఇరుకుగా ఉండడం, వచ్చే భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు.
తగినంతా పూజారులు, సిబ్బంది లేకపోవడంతో ఔట్‌సోర్సింగ్ కార్మికులతో ఆలయ నిర్వహణ చేస్తున్నారు. బాసర ఆలయ అభివృద్ధిపై ఈ ప్రాంత ప్రజలు భక్తులు ఎన్నో సంవత్సరాలుగా ఆశలు పెట్టుకుని ఎదురుచూస్తున్న తరుణంలో ప్రభుత్వం సమగ్ర మాస్టర్ ప్లాన్ ఆలయ పునరాభివృద్ధి చర్యలు చేపట్టడంపై భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఉమ్మడి రాష్ట్రంలో 2003లో గోదావరి పుష్కరాలు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు నిర్వహించగా సుమారు 100 కోట్లతో బాసర అభివృద్ధికి శ్రీకారం చుట్టారు.
2005లో దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి త్రిబుల్ ఐటీని మంజూరు చేశారు. బాసర ఆలయ అభివృద్ధికి నిధులను కూడా ఖర్చు చేశారు. అంతకుముందు 1995లో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు బాసరకు వచ్చి కొన్ని నిధులు మంజూరు చేశారు. ఆయన ఇక్కడే అక్షరాభ్యాసాన్ని చేశారు. వారి తర్వాత భారీ మొత్తంలో నిధులు మంజూరు చేసిన సీఎంగా రేవంత్‌రెడ్డి నిలిచారు. బీఆర్‌ఎస్ హయాంలో బాసరపై వివక్ష చూపారు. పదేళ్ల పాలనలో బాసర ఆలయ అభివృద్ధి మాస్టర్ ప్లాన్‌పై అప్పటి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోలేదు. నిధులు విడుదల చేయలేదు.
9 అంతస్తుల రాజగోపురం.. ఈశాన్యన కోనేరు..
వేల ఏళ్ల ఘన చరిత్ర గల్గిన బాసర జ్ఞాన సరస్వతి ఆలయ పునః నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.225 కోట్లను కేటాయించింది. దక్షిణ గంగగా గుర్తింపు పొందిన పవిత్ర గోదావరి నదీ తీరంలోని బాసర క్షేత్రంలో జ్ఞాన సరస్వతి దేవి కొలువై ఉన్నారు.. కురుక్షేత్ర యుద్ధానంతరం ప్రశాంతత కోసం వేద వ్యాస మహర్షి గోదావరి తీరానికి వచ్చి బాసరలో నివసించారట. ఆ సమయంలో స్వయంగా ఆయనే గోదావరి ఇసుకతో జ్ఞాన సరస్వతితో పాటు మహా లక్ష్మి, మహాకాళి అమ్మ వార్ల మూర్తులను ప్రతిష్టించారనేది స్థల పురాణం.. అలా ముగ్గురమ్మల కొలువైన క్షేత్రంగా బాసర ప్రసిద్ధి చెందింది.
బాసర ఆలయ పునఃనిర్మాణ పనులకు మాస్టర్ ప్లాన్ రూపొం దించే ముందు అధికారులు శృంగేరి పీఠాధిపతులతో సంప్రదించారు. భక్తుల సం ఖ్య.. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం 2 వేల చదరపు అడుగుల్లో ఉన్న గర్భాలయం, అర్ధ మండపాన్ని 5 వేల చదరపు అడుగులకు పెంచుతున్నారు. ఉత్తరం వైపున 9 అంతస్తుల రాజగోపురం, మిగిలిన మూడు దిక్కుల్లో 7 అతంస్తుల గోపురాలు, 33 అడుగుల వెడల్పుతో నాలు గు దిక్కుల మాడ వీధులు, ఉత్తర ద్వారం నిర్మించనున్నారు. మొత్తంగా ఆలయ విస్తీర్ణాన్ని 20 వేల చదరపు అడుగుల నుంచి 62 వేల చదరపు అడుగులకు పెంచుతున్నారు.
ఆలయం లో ప్రతి నిర్మాణాన్ని శిలలతో చేపట్టనున్నారు. 6 వేల మంది భక్తులకు అన్ని వసతులతో (ఫీడింగ్ రూమ్, ఫుడ్ స్టాల్స్, టాయిలెట్స్ తదితరాలతో) 70 వేల చదరపు అడుగులతో క్యూ కాంప్లెక్స్లు, 200 మంది ఏకకాలంలో కూర్చొని ధ్యానం చేసుకునేలా ధ్యాన మం దిరం, 20 వేల చదరపు అడుగుల వైశాల్యంతో వంట శాల, భోజన శాలలు, ప్రసాద పంపిణీ కేంద్రం, ఈశాన్య దిక్కున కోనేరు, తూర్పు దిక్కున ఆధ్యాత్మికత పరిఢవిల్లేలా అద్భుతమైన తోరణాలు,
సమా చార కేంద్రం, దేవాలయానికి ఉత్తర, తూ ర్పు దిక్కుల్లో రోడ్ల అభివృద్ధి, దేవాలయం నుంచి ఆవతలి వైపు వెళ్లేందుకు అండర్ పాస్, ఆవతలి వైపున సోలార్ రూ ప్‌టాప్‌తో వాహనాల పార్కింగ్, దేవాలయ ప్రాంగణంలో ఆహ్లాదకరమైన మొక్కలతో పుష్పవనం పనులు చేపట్టనున్నారు. ఆల య ప్రాంగణం ఆవల హెల్త్ సెంటర్ ఏర్పా టు చేయనున్నారు. భవిష్యత్‌లో ఆలయం వెనుక భాగం భారీ వృక్షాలతో ఆలరారేలా మొక్కలు నాటనున్నారు.
పుష్కరాలకు వచ్చే వారికి..
గోదావరి నది పుష్కరాలు వచ్చే ఏడాది జూన్‌లో ప్రారంభంకానున్నాయి. పుష్కరాల సమయంలో లక్షలాది మంది భక్తులు పుణ్య స్నానాలకు బాసర గోదావరి తీరానికి చేరకుంటారు. వారికి అవసరమైన అన్ని వసతులు ప్రస్తుత మాస్టర్ ప్లాన్‌లో భాగంగా చేపట్టనున్నారు. ఏ ఒక్క భక్తుడు ఇబ్బంది పడకుండా అదే సమయంలో ఆలయ సంప్రదాయాలు, భక్తుల విశ్వాసాలకు అనుగుణంగా పనులు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
నిధులు మంజూరు కావడం సంతోషం
బాసర అమ్మవారి ఆలయ పునరాభివృద్ధి పనులకు ప్రభుత్వం 225 కోట్ల నిధులను మంజూరు చేయడం చాలా సంతోషంగా ఉంది. గతంలో నిధులు మంజూరు చేసినా పనులు జరగలేదు. ఆలయాన్ని అభివృద్ధి చేయాలని పదేపదే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అసెంబ్లీలో చెప్పిన. ప్రభుత్వం స్పందించి ఈ పనులు చేపట్టడం సంతోషంగా ఉంది.
రామారావు పటేల్, ముధోల్ ఎమ్మెల్యే
ఆధ్యాత్మిక అభివృద్ధికి మూలం
గోదావరి పరిహక ప్రాంతంలో ఉన్న బాసర అభివృద్ధికి ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ అమలు చేయడం చాలా సంతోషం. బాసర ఆధ్యాత్మిక పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందితే ఇక్కడి భక్తుల సంఖ్య పెరిగి అభివృద్ధి జరిగే అవకాశం ఉంది. దేవాలయాలను అభివృద్ధి చేసి భక్తులకు సౌకర్యం కల్పించినప్పుడే భక్తుల రద్దీ పెరిగి ధర్మ పరిరక్షణ పరిరక్షించబడుతుంది.
సరస్వతి ఆనంద్ మహారాజ్




