4 August, 2026 | 5:16 PM

ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు సీఆర్ఆర్‌టీ వరం

04-08-2026 04:05 PM

- కరీంనగర్ మెడికవర్ వైద్యుల వెల్లడి

మంచిర్యాల టౌన్,(విజయక్రాంతి): అవయవాల పనితీరు దెబ్బతిని ఐసీయూలో చికిత్స పొందుతున్న రోగులకు కంటిన్యూస్ రీనల్ రీప్లేస్‌మెంట్ ట్రీట్‌మెంట్ (సీఆర్ఆర్‌టీ) ఆధునిక ప్రాణరక్షక చికిత్సగా నిలుస్తోందని కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. సాధారణ డయాలసిస్‌ను తట్టుకోలేని అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న రోగులకు ఈ చికిత్స ఆశాకిరణంగా మారుతోందని వారు వెల్లడించారు.

మంగళవారం మంచిర్యాలలోని ఓ హోటల్‌లో సీఆర్ఆర్‌టీ యంత్రం పనితీరు, వినియోగం, ప్రయోజనాలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో వారు మాట్లాడారు. తీవ్ర అనారోగ్యంతో ఐసీయూలో చికిత్స పొందుతున్న రోగుల్లో మూత్రపిండాల పనితీరు ఒక్కసారిగా దెబ్బతినడం సాధారణమేనని, అలాంటి సమయంలో సాధారణ డయాలసిస్‌ను తట్టుకునే పరిస్థితి చాలామందికి ఉండదని, అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో సీఆర్ఆర్‌టీ కీలక పాత్ర పోషిస్తుందన్నారు.

ఈ అత్యాధునిక యంత్రం ద్వారా రోగికి అవసరమైన బీపీ మందులను కొనసాగిస్తూ 24 గంటలపాటు నిరంతరాయంగా డయాలసిస్ నిర్వహించవచ్చని వివరించారు. దీంతో శరీరంలోని వ్యర్థ పదార్థాలు, విషతుల్యాలు, అదనపు ద్రవాలు క్రమంగా తొలగిపోవడంతో రోగి శరీరంపై ఒత్తిడి తగ్గుతుందని చెప్పారు. సీఆర్ఆర్‌టీ చికిత్స వల్ల గుండె, ఊపిరితిత్తులు, కాలేయం వంటి కీలక అవయవాలపై అదనపు భారం పడకుండా కాపాడటంతో పాటు అవి తిరిగి సాధారణ స్థితికి చేరుకునేందుకు అవకాశం పెరుగుతుందని వైద్యులు వెల్లడించారు.

కరీంనగర్ లో సీఆర్ఆర్‌టీ సేవలు

కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రిలో సీఆర్ఆర్‌టీ సేవలు అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. ఈ యంత్రాన్ని సమర్థవంతంగా వినియోగిస్తూ ఇప్పటివరకు పలువురు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న రోగులను వైద్య బృందం సమిష్టి కృషితో కాపాడగలిగామని వారు వెల్లడించారు. అత్యవసర పరిస్థితుల్లో సమయానికి సరైన చికిత్స అందించడం, నిపుణుల పర్యవేక్షణలో ఆధునిక వైద్య సాంకేతికతను వినియోగించడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధ్యమవుతున్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా బహుళ అవయవాల పనితీరు దెబ్బతిన్న రోగుల చికిత్సలో సీఆర్ఆర్‌టీ కీలకంగా మారిందని వివరించారు.

ప్రజల్లో ఈ చికిత్స విధానంపై సరైన అవగాహన పెంపొందించడం కూడా అవసరమని వైద్యులు సూచించారు. ప్రాణాపాయ పరిస్థితుల్లో ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదిస్తే రోగిని కాపాడే అవకాశాలు మరింత పెరుగుతాయని పేర్కొన్నారు. మెడికవర్ సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ అవగాహన కార్యక్రమంలో నెఫ్రాలజిస్టు డాక్టర్ రాంచందర్, క్రిటికల్ కేర్ నిపుణుడు డాక్టర్ ఉపేందర్ రెడ్డి, ఎమర్జెన్సీ మెడిసిన్ వైద్యుడు డాక్టర్ సత్యనారాయణ, మార్కెటింగ్ మేనేజర్ కోట కర్ణాకర్, హరీష్  పబ్బ సిద్దు తదితరులు పాల్గొన్నారు.