27 July, 2026 | 2:16 AM

ఎదుగూబొదుగు లేని కొలువు

27-07-2026 01:43 AM
  1. రైల్వేలో కేడర్ రీస్ట్రక్చరింగ్ జాడేది.? 
  2. తీవ్ర జాప్యంపై ఉద్యోగుల్లో ఆందోళన
  3. ప్రమోషన్లు నిలిచిపోయాయని ఆవేదన
  4. సీఆర్‌సీ 2023 నివేదికను అమలు చేయాలని విజ్ఞప్తి

మహబూబాబాద్, జులై 26 (విజయక్రాంతి): భారతీయ రైల్వేలో పనిచేస్తున్న లక్షలాది మంది గ్రూప్ ‘సి’, ‘డీ’ ఉద్యోగుల భవిష్యత్తును ప్రభావితం చేసే కేడర్ రీస్ట్రక్చరింగ్ కమిటీ (సీఆర్‌సీ 2023) ప్రక్రియలో కొనసాగుతున్న జాప్యం ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళనకు దారితీస్తోంది. సీఆర్‌సీ కమిటీ 2022 ఏర్పాటు చేస్తే 2025 డిసెంబర్ వరకు పొడిగించినా ఇప్పటికి కొలిక్కి రాకపోవడంతో ఎప్పుడొస్తుందా అనే ఆశగా రైల్వే ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు.

భారతీయ రైల్వేలో మొత్తంగా 12 లక్షల మందికి పైగా గ్రూప్ సీ, డీ కేటగిరిలో విధులు నిర్వహిస్తుండగా, 99 శాతం వీరే కావడం విశేషం. దక్షిణ మధ్య రైల్వే (ఎస్‌సీఆర్ ) సికింద్రాబాద్ డివిజన్ పరిధిలో సుమారు 22 వేలకు పైగా ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు. డివిజన్ పరిధిలోని తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని 3,350 ట్రాక్ (టీకేఎం) కిలోమీటర్ల మేర రైల్వే ట్రాక్ మెయింటెనెన్స్, ఇతర విభాగాల్లో పనిచేస్తున్నారు.

సీఆర్‌సీ కమిటీ ఏర్పాటై చాలా కాలం గడిచినా తుది నిర్ణయాలు వెలువడకపోవడంతో పదోన్నతులు నిలిచిపోయాయని, వేలాది మంది గ్రూప్ సీ, డీ స్థాయి రైల్వే ఉద్యోగులు ఒకే గ్రేడ్‌లో సంవత్సరాల తరబడి పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొంటున్నారు. రైల్వేలో వందే భారత్ వంటి ఆధునిక రైళ్ల ప్రవేశం, ట్రాఫిక్ పెరుగుదల, సాంకేతిక మార్పులు, భద్రతా ప్రమాణాల విస్తరణతో పనిభారం గణనీయంగా పెరిగిందని ఉద్యోగులు చెబుతున్నారు.

కాగా అనేక మంది ఉద్యోగులు 15 నుంచి 25 ఏళ్లుగా ఒకే హోదాలో విధులు నిర్వహిస్తున్నారని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు చెబుతున్నారు. ఖాళీలు ఉన్నప్పటికీ కేడర్ శాతాల్లో మార్పులు లేకపోవడం వల్ల ప్రమోషన్లు నిలిచిపోయాయని దీనితో తమ ఉద్యోగాల్లో ఎలాంటి ఎదుగుబొదుగు లేకుండా పోయిందని పేర్కొంటున్నారు.  కేడర్ రీస్ట్రక్చరింగ్ ఆలస్యం కారణంగా ఉన్నత వేతన శ్రేణులు అందక మేము ఆర్థికంగా నష్టపోతున్నారని ఉద్యోగులు చెబుతున్నాయి. దీనివల్ల భవిష్యత్‌లో పెన్షన్, పదవీ విరమణ ప్రయోజనాలపై కూడా ప్రభావం పడుతున్నట్లు పేర్కొంటున్నారు.  

అన్ని విభాగాల ఉద్యోగుల ఒకే డిమాండ్

రన్నింగ్ స్టాఫ్, ట్రాక్ మెయింటైనర్లు, టెక్నీషియన్లు, కమర్షియల్, ఆపరేటింగ్, సిగ్నల్, టెలికాం, ఎలక్ట్రికల్, మెకానికల్, మెడికల్, ఇంజినీరింగ్ తదితర విభాగాలకు చెందిన ఉద్యోగులందరూ కేడర్ రీస్ట్రక్చరింగ్‌ను త్వరగా పూర్తి చేయాలని ఉద్యోగ సంఘాలు పేర్కొంటున్నాయి. ఇది ఒక్క యూనియన్‌కు సంబంధించిన అంశం కాదని, రైల్వే ఉద్యోగుల ఉమ్మడి ఆకాంక్షగా మారిందని చెబుతున్నారు.

సీఆర్‌సీ వెంటనే అమలు చేయాలి

రైల్వే కార్మికుల పదోన్నతులకోసం ఏర్పాటు చేసిన సీఆర్‌సీ రిపోర్ట్ వెంటనే ఇప్పించి యూనియన్ లతో ఏర్పాటు చేసుకున్న ఒప్పం దం ప్రకారం తక్షణం అమలు చేయాలి. ప్రతి పది సంవత్సరాలకు అమలు చేయాల్సిన కేడర్ రిస్ట్రక్క్చరింగ్ 2023 నుంచి అమలు చేయాలి. రైల్వే ఉద్యోగులు ఎంతో ఆశతో మూడేళ్లుగా ఎదురు చూస్తున్న సీఆర్‌సీని వెంటనే అమలు చేసి వారికి పదోన్నతులు కల్పించాలి.

 రవీందర్, మజ్దూర్ యూనియన్, సికింద్రాబాద్ డివిజనల్ సెక్రెటరీ