27 July, 2026 | 2:11 AM

ఎస్‌ఆర్‌ఎస్పీలో నలుగురు గల్లంతు

27-07-2026 01:40 AM

ముగ్గురి మృతదేహాలు లభ్యం

నిజామాబాద్,  జూలై 26 (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని ముప్కాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు (ఎస్‌ఆర్‌ఎస్పీ) బ్యాక్‌వాటర్ ప్రాంతంలో ఆదివారం జరిగిన విషాదకర ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సరదాగా విహారయాత్రకు వచ్చిన నలుగురు యువకులు ప్రమాదవశాత్తు వరద కాలువలో జారిపడి గల్లంతయ్యారు. పోలీసుల సమాచారం ప్రకారం మహారాష్ట్రలోని బోకర్‌కు చెందిన ఆర్హాన్ (17) నిజామాబాద్‌లోని ఆటోనగర్‌కు చెందిన కలీం (24), అమ్ము అలియాస్ నజువత్ (24), అజీమ్ (24), ఖలీమ్‌లు కలిసి శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ ప్రాంతానికి విహారయాత్రకు వెళ్లారు. 

 ప్రమాదవశాత్తు నీటిలో పడి గల్లంతయ్యారు. పోలీసు, రెవెన్యూ శాఖలు, గజఈతగాళ్లు, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు, అగ్నిమాపక సిబ్బంది సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టగా ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో యువకుడి మృతదేహం కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పీ సాయి చైతన్య సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.