30 May, 2026 | 2:46 AM

సాగు లక్ష్యం.. 1.34 కోట్ల ఎకరాలు

30-05-2026 02:10 AM
  1. వానాకాలం సాగు ప్రణాళిక ఖరారు  
  2. వరి, పత్తిదే అగ్రస్థానం
  3. ఆ తరువాత మక్కజొన్న, మిగతా పంటలు నామమాత్రంగానే..
  4. వ్యవసాయ శాఖ అంచనాలకు అనుగుణంగా విత్తనాలు సిద్ధం

హైదరాబాద్, మే 29 (విజయక్రాంతి) : వానాకాలం సాగు ప్రణాళికను వ్యవసాయ శాఖ ఖరారు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఒక కోటి 34 లక్షల 66 వేల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు అవుతాయని.. అందులో అత్యధికంగా 69.50 లక్షల ఎకరాల్లో వరి, 52 లక్షల ఎకరాల్లో పత్తి సాగయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది.

ఆ తరువాత మక్కజొన్న 5.40 లక్షలు, కంది 5.10 లక్షలు, మిర్చి 1.90 లక్షలు, సోయాబీన్ 4.10 లక్షల ఎకరాల్లో, పెసర్లు 65 వేలు, మినుములు 28 ఎకరాల్లో సాగయ్యే అవకాశం ఉంది.  సాగు విస్తీర్ణానికి తగినట్లుగా వరి విత్తనాలు 17.80 లక్షల క్వింటాళ్లు, మక్కజొన్న 0.48 లక్షల టన్నలు, పత్తి ప్యాకెట్లు 212.11 లక్షలు, సోయా చిక్కుడు 1.35 లక్షల క్వింటాళ్ల విత్తనాలను అందుబాటులో ఉంచింది.  

సన్నాల వైపే రైతుల మొగ్గు

ఎప్పటి మాదిరిగానే రాష్ట్రంలో వరి, పత్తి పంట సాగుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. అయితే వరిలో సన్నాల సాగు పెరిగే అవకాశం ఉందని వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. రెండు సీజన్ల నుంచి ప్రభుత్వం బోనస్ ఇస్తుండటంతో రైతులు ఎక్కువగా సన్నాల సాగుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పటికే వరి విత్తనాలు కొనుగోలు చేశారు. రెండో ప్రధాన పంటగా పత్తి సాగు ఈసారి ఆశించిన దానికంటే పెరిగే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు భావిస్తున్నారు.

చిరుధాన్యాల సాగు ఈ ఏడాదిలోనూ తక్కువే..

ఎప్పటి మాదిరిగానే ఈ ఏడాది కూడా చిరుధాన్యాలు తక్కువ విస్తీర్ణంలో సాగు చేయనున్నారు.  ఈ పంటలను బోర్లు, బావులు కింద మాత్రమే రైతులు సాగు చేయనున్నారు. యాసంగి సీజన్(ప్రస్తుత)లో రాష్ట్ర వ్యాప్తంగా 80 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవగా.. అందులో అగ్రస్థానంలో వరి 65 లక్షల ఎకరాలు, ఆ తరువాత పత్తి అధికంగా  వేశారు. మిగతా పంటలు నామమాత్రంగానే సాగు చేశారు. 

నకిలీ విత్తనాల జోరు!

వానాకాలం సీజన్ సమీపిస్తుండటంతో నకిలీ విత్తనాల దందా జోరందుకుంది. ముఖ్యంగా ఆదిలాబాద్, నిజామాబాద్, గద్వాల్, సూర్యాపేట, నల్లగొండ జిల్లా కేంద్రాలుగా రూ.కోట్లు విలువ చేసే  దందా సాగుతోంది. నిఘా వ్యవస్థల కళ్లు గప్పి అక్రమార్కులు వివిధ రాష్ట్రాల నుంచి నకిలీ విత్తనాలు తరలిస్తున్నారు. ముఖ్యంగా నకిలీ పత్తి విత్తనాలకు అడ్డుకట్ట వేసేందుకు టాస్క్‌ఫోర్స్ బృందాలు రంగంలోకి దిగాయి.

స్థానిక పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులతో సంయుక్తంగా దాడులు నిర్వహిస్తున్నాయి. ఈ దాడుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే సుమారు రూ.1.50 కోట్లు విలువ చేసే నకిలీ విత్తనాలు పట్టుబడ్డాయి. నకిలీ పట్ల రైతులు జాగ్రత్తగా ఉండాలని వ్యవసాయ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. వ్యవసాయ శాఖ ధ్రువీకరించిన విత్తనాలనే కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు.