‘సర్’తో సమస్య రావొచ్చు
- దళిత, గిరిజన, వలసవాదుల ఓట్లకు ముప్పుంది
- పార్టీ కోసం అందరూ కష్టపడాలి
- నేను కూడా క్యాడర్‌కు అందుబాటులో ఉంటా
- పీఏసీ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, మే 29 (విజయక్రాంతి) : ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (సర్ ఇంటెన్సివ్ రివిజన్)పై నేతలంతా పూర్తి అవగాహనతో ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. దళితులు, గిరిజనులు, మైనార్టీలు, వలసవాదుల ఓట్లు పోయే అవకాశం ఉందని, క్షేత్రస్థాయిలో ఉంటూ అప్ర మత్తంగా వ్యవహరించాలని సూచించారు. శుక్రవారం గాంధీభవన్‌లో పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ అధ్యతన కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశంలో జరిగింది.
ఈ సమావేశంలో ఏఐసీసీ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, ప్రభుత్వ సలహాదారు, పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు తదితరులు పాల్గొ న్నారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘సర్’ వల్ల ఎలాంటి ఇబ్బందులు రాబోతున్నాయో నాయకులు ముందుగానే అవగాహన కలిగి ఉండాలన్నారు. ‘పార్టీ తరఫున వేలాది మంది సర్పంచ్ లు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు ఉన్నారు.
సమన్వయంతో పని చేసి వలసలు పోయిన వారి ఓట్లు పోకుండా జాగ్రత్త పడాలి’ అని పేర్కొన్నారు. రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు హైదరాబాద్ పరిధిలో బాధ్యతలు తీసుకోవాలని, హైదరాబాద్ నగర పరిధిలోని 15 నియోజకవర్గాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసి సర్‌పై ప్రజలను అప్రమ త్తం చేయాలని స్పష్టం చేశారు. అలాగే మహి ళా కాంగ్రెస్ తరఫున క్లస్టర్ల వారీగా సమావేశాలు నిర్వహించాలని సూచించారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఇంచార్జ్‌లను నియమించి ఒక్క ఓటు పోకుండా చూడాలన్నారు.
పార్టీ కోసం సమయమివ్వండి
ఇంచార్జ్ మంత్రులు ప్రతి పది రోజుల్లో ఒక రోజు పార్టీ కార్యక్రమాల కోసం పూర్తి సమయం కేటాయించాలని, క్షేత్ర స్థాయికి వెళ్లి కార్యకర్తలను కలవాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. నేను కూడా నెలలో మూడు రోజులు క్యాడర్‌కు అందుబాటులో ఉంటానని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు.. ప్రతి ఒక్కరూ పార్టీ కోసం పని చేయాల్సిందేనని ఆదేశించారు. నాతో పాటు ఎవ్వరికీ మినహాయింపు ఉండదన్నారు.
పీసీసీ మాజీ అధ్యక్షుల సల హాలు, సూచనలు తీసుకోవాలి సీఎం సూచించారు. బూత్ ఎన్‌రోలర్ సాయంతో గతంలో 90 రోజుల్లో 45 లక్షల డిజిటల్ సభ్యత్వం చేయించామని, ఎక్కువ సభ్యత్వం నమోదు చేయించిన వారికి రాహుల్‌గాంధీతో సన్మానం చేయించామని సీఎం గుర్తు చేశారు.
నేతల పనితీరుపై సీఎం అసంతృప్తి
‘సర్’ విషయంలో పార్టీ నేతల తీరుపై సీఎం రేవంత్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. కొందరు నాయకులు అలసత్వంతో ఉన్నారని, ఎందుకు వెనుకబడ్డారో క్లారిటీ ఇ వ్వాలని ఆదేశించినట్లుగా తెలిసింది. హైదరాబాద్ పరిధిలోని నేతల పనితీరు సంతృప్తికరంగా లేదని, దీనిపై క్లారిటీ ఇవ్వాలని హైదరాబాద్ ఇంచార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు సీఎం సూచించినట్లు తెలిసింది.
మాస్టర్ ట్రైనీలకు శిక్షణ
ప్రతి ఓటునూ చెక్ చేయాలి
పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్
హైదరాబాద్, మే 29 (విజయక్రాంతి) : సర్ ప్రక్రియపై పీసీసీ దృష్టి సారించింది. ఈ అంశంపై పార్టీ నేతలు అనుసరించాల్సిన తీరుపై గాంధీభవన్‌లో శుక్రవారం నుంచి శిక్షణ తరగతులు ప్రారంభించింది. టీపీసీసీ మాస్టర్ ట్రైనీలకు ఏఐసీసీ శిక్షణ విభాగం నుంచి వచ్చిన సౌరబ్, నిశాంత్, అనూష శిక్ష ణ ఇస్తున్నారు. శిక్షణ తీసుకున్న మాస్టర్ ట్రైనీ లు నియోజకవర్గాల్లోని బీఎల్‌ఏలకు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, ఏఐసీసీ వ్యవహారాల ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్‌ను మరింత బలోపేతం చేసి సమర్థవంతమైన కార్యవర్గాన్ని సిద్ధం చేయడానికి రాష్ట్రంలో సంఘటన్ సృజన్ అభియాన్ పక్రియ పకడ్బందీ చేశామన్నారు. దాదాపు 90కి పైగా నియోజకవర్గాల్లో బీఎల్‌ఏలతో పాటు జిల్లా, మండల కమిటీలు దాదాపు పూర్తి చేశామన్నారు. పశ్చిమబంగాల్‌లో సర్ పేరుతో 93 లక్షల ఓట్లు తొలగించారని, అక్కడ బీజేపీ చేసిన కుట్రలతో ప్రభుత్వమే మారిపోయిందన్నారు. అలాంటి కుట్రలు జరగకుండా చూసుకోవాలని హెచ్చరించారు.






