‘ఏఐ’తో పార్కింగ్ సమస్యకు పరిష్కారం : మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్, జూన్ 22( విజయక్రాంతి): హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని అన్ని నగరాలు, పట్టణాల్లో కృత్రిమ మేధ (ఏఐ)ని వినియోగించి వాహ నాల పార్కింగ్ సమస్యకు పరిష్కారం చూపవచ్చని, అందుకు తగిన విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సంబంధిత అధికారులు, ఇంజినీర్లను ఆదేశించారు. రాజధానిలోని సచివాలయంలో శనివారం ‘ఈజీ పార్క్ ఏఐ’ అనే సంస్థ ప్రదర్శించిన డిజిటల్ ప్రెజెంటేషన్‌ను ఆయన తిలకించి మాట్లాడారు. అర్బన్ ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల పార్కింగ్ సవాల్‌గా మారిన సందర్భంలో ఆ సమస్యలకు ఏఐ పరిష్కారంగా కనిపిస్తోందన్నారు. రోజుకు రాష్ట్రంలో వ్యక్తిగత వాహనాల సంఖ్య పెరుగుతోందని, ఒక్క హైదరాబాద్‌లోనే ప్రతిరోజూ 14 లక్షల బైకులు, 70 వేల క్యాబ్‌లు, లక్ష ఆటోలు తిరుగుతున్నాయన్నారు. అన్ని వాహనాలను పార్కింగ్ చేయడం పెద్ద సమస్యగా పరిణమించిందన్నారు. వాహనదారులు ముందుగానే పార్కింగ్ స్లాట్లను ముందే బుక్ చేసుకునే విధంగా ప్రత్యేక యాప్‌ను రూపొందించాలని సూచించారు.






