ఎస్‌ఐ పేరుతో సైబర్ స్కాం?
78 వేలు పోగొట్టుకున్న చిరుద్యోగి
మహబూబాబాద్, ఆగస్టు 23 (విజయక్రాంతి): నేను ఎస్‌ఐ ని మాట్లాడుతున్నాను.. నాకు అత్యవసరంగా డిజిటల్ పేమెంట్ కావాలి.. మా డ్రైవర్ ద్వారా నీకు తిరిగి లిక్విడ్ క్యాష్ పంపిస్తానని చెప్పి ఓ చిరుద్యోగి నుండి 78 వేల రూపాయలు సైబర్ నేరగాళ్లు కొట్టేసిన ఘటన ఈనెల 18న మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. కేసముద్రం పట్టణానికి చెందిన దేశబోయిన కుమారస్వామి నెల్లికుదురు మండలంలోని వైన్ షాపులో కౌంటర్ బాయ్ గా విధులు నిర్వహిస్తున్నాడు.
ఈ క్రమంలో ఈనెల 18న రాత్రి గుర్తుతెలియని వ్యక్తి ఎస్ ఐ గా పరిచయం చేసుకొని, తనకు అత్యవసరంగా డిజిటల్ క్యాష్ కావాలని ఉదయం నీకు లిక్విడ్ క్యాష్ ఇస్తానని, క్యూఆర్ కోడ్ పంపిస్తున్నానని చెప్పడంతో నిజమని భావించిన అతను 25 వేల రూపాయలను ఫోన్ పే ద్వారా బదిలీ చేశాడు. మరుసటి రోజు ఉదయం ఇదేవిధంగా 23,500 ఒకసారి, 30 వేల రూపాయలు మరొకసారి బదిలీ చేయించుకున్నాడు.
మొత్తం 78,500 బదిలీ చేయించుకున్న తర్వాత, సాయంత్రం వరకు కూడా డ్రైవర్ ద్వారా డబ్బులు పంపించకపోవడంతో తనకు కాల్ చేసిన ఫోన్ నెంబర్ కు కాల్ చేయగా స్విచాఫ్ రావడంతో అనుమానం వచ్చి, పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఎస్ ఐ ని సంప్రదించగా తాnu డబ్బుల కోసం ఎవరికి ఎలాంటి కాల్ చేయలేదని చెప్పడంతో మోసపోయినట్లు గుర్తించిన అతను వెంటనే 1930 కి కాల్ చేసి ఫిర్యాదు చేశాడు. అలాగే పోలీసులకు తాను మోసపోయిన ఘటనపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసి న్యాయం చేయాలంటూ వేడుకున్నాడు.
అపరిచిత నెంబర్లకు స్పందించొద్దు
అపరిచిత నంబర్ల నుండి వచ్చే ఫోన్ కాల్స్ కు స్పందించవద్దని, గుడ్డిగా నమ్మి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయవద్దని, సైబర్ నేరాల పట్ల అనునిత్యం అప్రమత్తంగా ఉండాలని కేసముద్రం ఎస్ ఐ క్రాంతి కిరణ్ అన్నారు.






