రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు
- ఫెడెక్స్ కొరియర్‌లో డ్రగ్స్ సరఫరా అంటూ రూ.9 లక్షలు స్వాహా
- మరో ఘటనలో ట్రేడింగ్ నేర్పిస్తామంటూ రూ.13.9 లక్షలు లూటీ
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 30 (విజయక్రాంతి): ఇటీవలి కాలంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఫెడెక్స్ పార్సిళ్లలో డ్రగ్స్ ఉన్నాయంటూ, స్టాక్ ట్రేడింగ్‌లో మెళకువలు నేర్పిస్తామంటూ, సీబీఐ, క్రైమ్ బ్రాంచ్ అధికారులమంటూ ఫోన్లు చేసి బాధితుల బ్యాంకు ఖాతాలను లూటీ చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనలు నగరంలో మరో రెండు వెలుగు చూశాయి.
రూ.9 లక్షలు స్వాహా..
సైబర్ క్రైమ్ డీసీపీ కవిత తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగి(24)కి సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి ఫెడెక్స్ కొరియర్‌లో ‘మీ’ ఆధార్ కార్డుపై ఉన్న చిరునామాతో డ్రగ్స్ సరఫరా అవుతున్నాయని, దీనిపై కేసు నమోదవకుండా ఉండాలంటే ముంబాయి ఎన్డీఏ బ్రాంచ్ అధికారులతో మాట్లాడాలని సూచించారు. ఆమెతో ముంబాయి పోలీసు అధికారులమంటూ పరిచయం చేసుకున్న సైబర్ నేరగాళ్లు.. బాధితురాలిని పలు రకాల ప్రశ్నలు వేసి భయభ్రంతులకు గురిచేశారు.
అనంతరం ఆమె ఆధార్, పాన్‌కార్డు, బ్యాంకు డీటెయిల్స్ పొందారు. విచారణ నిమిత్తం బాధితురాలి ఖాతాలోని మొత్తాన్ని సైబర్ క్రైమ్ పోలీసులకు బదిలీ చేయాలని, విచారణ పూర్తయ్యాక తిరిగి పంపిస్తామని చెప్పారు. దీంతో బాధితురాలు తన ఖాతాలో డబ్బు లేకపోవడంతో బ్యాంకు నుంచి రూ. 9 లక్షల లోన్ తీసుకుని వారు సూచించిన ఖాతాకు బదిలీ చేసింది.కానీ, ఎంతకి సైబర్ నేరగాళ్లు డబ్బులు తిరిగి పంపకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు ఆదివారం హైదరాబాద్ సీసీఎస్ (సైబర్ క్రైమ్ పోలీసుల)ను ఆశ్రయించింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
ట్రేడింగ్‌లో మెళకువలని..
మరో కేసులో హైదరాబాద్‌కి చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగి(35) సెల్‌ఫోన్ చూస్తున్న క్రమంలో ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చే ఓ అడ్వర్టుజ్‌పై క్లిక్ చేశాడు. దీంతో అతడు అనుకోకుండా 100 మందితో కూడిన ‘5 పైసా 210 వాల్యూ ఇన్వెస్ట్‌మెంట్ పోర్ట్‌ఫోలియో’ అనే వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అయ్యాడు. అనంతరం స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువగా డబ్బు సంపాదించవచ్చని గ్రూపులోని ఒకరు అతడికి సూచించారు. దీంతో ఇదంతా నిజమని నమ్మిన బాధితుడు వారు సూచించిన విధంగా ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెట్టాడు. ఈ క్రమంలో ఓ వెబ్ లిం క్ పంపి బాధితుడికి సంబంధించిన వివరాలను నింపాల్సిందిగా కోరగా, అతడికి సంబంధించిన బ్యాంకు ఖాతాతో పాటు పలు వివరాలను వారికి అందించాడు.
ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెట్టిన బాధితుడికి మొదట్లో ఆదాయాలను చూపించారు. అధికంగా డబ్బు సంపాదించాలనే ఆశతో వచ్చిన ఆదాయాలను మళ్లీ పెట్టుబడులుగా పెట్టాడు. మొత్తంగా పొందిన లాభాలను విత్‌డ్రా చేసుకోవాలంటే పలు చార్జీలు చెల్లించాల్సి ఉంటుందని సూచించడంతో మళ్లీ కొద్ది డబ్బు పంపాడు. ఇలా మొత్తం రూ. 13,96,640 పలు ధఫాలుగా చెల్లించాడు. ఎంతకీ డబ్బు విత్‌డ్రా చేసుకోవడం కుదరకపోవడంతో, మోసపోయానని గ్రహించిన బాధితుడు ఆదివారం సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. సైబర్ క్రైమ్ జరిగినట్లు గుర్తించిన బాధితులు గంటలోపు cybercrime.gov.in మెయిల్ ఐడీకి, టోల్‌ఫ్రీ నం. 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని డీసీపీ తెలిపారు.






