ఇకపై పదేళ్ల జైలు శిక్ష
- మద్యం మత్తులో వాహనాలు నడిపి మరణాలకు కారణమైతే అంతే సంగతులు
డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ఒక్క రోజే పట్టుబడ్డ 262 మంది మందుబాబులు
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 30 (విజయక్రాంతి): మద్యం తాగి వాహనం నడుపుతున్నారా? ఆ మత్తులో ప్రమాదాలకు కారణమవుతున్నారా? అయితే ఇన్నాళ్లు ఒక లెక్క.. ఇక నుంచి మరో లెక్క అని హెచ్చరిస్తున్నారు సైబరాబాద్ పోలీసులు. నేటి నుంచి అమల్లోకి వచ్చే కొత్త చట్టాల ద్వారా మద్యం తాగి వాహనం నడిపి ఎవరి మరణానికైనా కారణమైతే కొత్త చట్టం భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 105 కింద 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని చెబుతున్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న ప్రమాదాల తీవ్రతను అరికట్టడానికి దాదాపు 150 ఏళ్ల నుంచి ఉన్న చట్టాలను ఆధునికీకరించి కొత్త చట్టాలను అమలులోకి తెస్తున్నారు.
పట్టుబడిన 262 మంది మందుబాబులు..
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో శనివారం అర్ధరాత్రి ఒక్క రోజే 262 మంది మందుబాబు లు చిక్కారు. వీరి నుంచి 191 ద్విచక్ర వాహనాలు, 11 త్రీ వీలర్స్, 56 కార్లు, 4 హెవీ వెహికిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీరందరిని కోర్టులో హాజరుపరచనున్నట్లు పోలీసులు తెలిపారు.






