28-10-2025 09:48:11 AM
అమరావతి: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో(West central Bay of Bengal) మొంథా తుపాను(Severe Cyclone Montha) తీవ్రతుపానుగా బలపడింది. తుపాన్ గడిచిన 6 గంటల్లో 15 కిలో మీటర్ల వేగంతో కదులుతున్నట్లు భారత వాతావరణ శాఖ ప్రకటించింది. మచిలీపట్నానికి 190 కిలో మీటర్ల, కాకినాడకు 270 కిలో మీటర్లు, విశాఖకు 340 కిలో మీటర్లు దూరంలో తుపాన్ కేంద్రీకృతం అయింది. రాత్రికి కాకినాడ- మంచిలీపట్నం మధ్య తీవ్ర తుపాను తీరం దాటే అవకాశముంది. తీరం దాటే సమయంలో గంటలకు 90-110 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయనున్నాయి. తీవ్రతుపాను ప్రభావంతో శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు అతిభారీ వర్షాలు పడనున్నాయి. తుపాన్ వల్ల ఏపీలో కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముంది.
ఇప్పటికే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, నెల్లూరు, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. వర్షంలో చిక్కుకున్న బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించారు. ఉప్పాడ తీరంలో సముద్రం ల్లోకల్లోలం సృష్టిస్తోంది. అలలు ఎగిసిపడుతున్నాయి. మొంథా తుపాన్ ప్రభావంతో కోనసీమ జిల్లాల్లో వర్షం కురుస్తోంది. కోనసీమలో అర్ధరాత్రి నుంచి వాన పడుతోంది. వర్షం కారణంగా పలుచోట్ల విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగింది. జిల్లా యంత్రాంగం తుపాన్ ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు చేపట్టింది. సముద్ర తీరప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అవసరమైతే తప్ప ప్రజలు ఎవరూ బయటకు రావొద్దని అధికారులు హెచ్చరించారు.
విద్యుత్ స్తంభాల వద్ద ఉండొద్దని ఈపీడీసీఎల్ సూచించింది. విశాఖలో రాత్రి నుంచి తీవ్ర జల్లులతో వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మొంథా తుపాన్ నేపథ్యంలో విజయవాడలో జోరు వానలు పడనున్నాయి. ఇవాళ విజయవాడలో 16 సెంమీ వర్షపాతానికి పైగా నమోదయ్యే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. వాతావరణ శాఖ హెచ్చరికలతో వీఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. తుపాన్ తీవ్రత ఎక్కువ ఉంటే దుకాణాలు, వాణిజ్య సంస్థలు మూసివేయాలని విజ్ఞప్తి చేశారు. మెడికల్ షాపులు, కూరగాయల దుకాణాలు, పాల విక్రయ దుకాణాలు తెరుచుకోవచ్చని వీఎంసీ అధికారులు పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్, వీఎంసీ ప్రధాన కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేశారు. మంగళవారం ఉదయం. 11 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయానికి వెళ్లనున్నారు. మొంథా తుఫాన్ పరిస్థితిపై సమీక్షించనున్నారు. మధ్యాహ్నం కొత్త జిల్లాలపై కేబినెట్ సబ్ కమిటీతో చంద్రబాబు సమావేశం కానున్నారు.
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కంట్రోల్ రూమ్ నెంబర్: 9154970454
వీఎంసీ కంట్రోల్ రూమ్ నంబర్లు: 08662424172, 08662422515
వీఎంసీ కంట్రోల్ రూమ్ నెంబర్: 08662427485