బీజేపీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు
- మోదీ ప్రభుత్వ మనుగడ ఎంతకాలమో?
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని
కరీంనగర్, జూన్ 25 (విజయక్రాంతి): కేంద్రంలో సొంతంగా అధికారం చేపడతామని ప్రగల్భాలు పలికిన బీజేపీకి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. మంగళవారం కరీంనగర్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఇతరులపై ఆధారపడి ఏర్పడిన నరేంద్రమోదీ ఎన్డీయే ప్రభుత్వం ఎంతకాలం మనుగడ కొనసాగిస్తుందో వేచి చూడాలన్నారు.
తెలంగాణలో గెలిచిన 8 మంది ఎంపీలు తెలంగాణ పట్ల చిత్తశుద్ధి ఉంటే విభజన హామీల అమలుకు కేంద్రంపై ఒత్తిడి తేవాలని సూచించారు. సింగరేణిని ప్రైవేటీకరణ చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి వెంకటస్వామి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కేదారి, జిల్లా కార్యవర్గ సభ్యులు సృజన్‌కుమార్, సురేందర్‌రెడ్డి, గూడెం లక్ష్మి, ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు మణికంఠరెడ్డి, లక్ష్మణ్, భారత జాతీయ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు మల్లవ్వ, సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యుడు పైడిపెల్లి రాజు పాల్గొన్నారు.






